సనాతన ధర్మం అంటూ గావు కేకలు పెడబొబ్బలు
ఏంటో నోరు తిరగని మాటలు మాట్లాడితే అది అద్భుతం. ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడితే అది బ్రహ్మాండం.
By: Tupaki Desk | 4 Oct 2024 4:00 AM GMTఏంటో నోరు తిరగని మాటలు మాట్లాడితే అది అద్భుతం. ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడితే అది బ్రహ్మాండం. ఇపుడు సనాతన ధర్మం అలాగే మారిందా అంటే అవునేమో అనిపిస్తోంది. పొరుగున ఉన్న ఒక యువ రాజకీయ నేత, ఇటీవలే డిప్యూటీ సీఎం అయిన ఒకాయన సనాతన ధర్మాన్ని వైరస్ అని పోలుస్తాడు. ఆయన పేరులోనే సనాతన స్పర్శ ఉంది.
సరే ఇపుడు ఏపీకి చెందిన ఒక నాయకుడు సనాతన ధర్మానికి విఘాతం కలుగుతోంది అని గగ్గోలు పెడుతున్నాడు. పాత శంకరాభరణం సినిమాలో జేవీ సోమయాజులు పాత్ర చెప్పినట్లుగా కొడికట్టిపోతున్న సనాతన దీపానికి రెండు చేతులూ అడ్డం పెట్టి కాపాడేందుకు సిద్ధం అంటున్నారు.
ఇవన్నీ విన్న వారికీ చూసిన వారికి ఏమిటీ వైపరిత్యాలు అనిపిస్తాయి. ఎక్కడో హిమాలయాలలో ఈ రోజుకీ కఠో తపస్సు చేస్తూ ముక్కు మూసుకుని కూర్చుని స్వాములు సనాతన ధర్మానికి సారధులు. అంతే కాదు ఏ ఫలాపేక్షా లేకుండ పీఠాలు మఠాలు నడుపుతూ జనాలకు చేతనైన బోధ చేస్తూ హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న వారు ఇంకా ధన్యులుగా ఉన్నారు.
అసలు ఆ మాటకు వస్తే వారూ వీరూ కాదు హిందూ ధర్మాన్ని తనను తాను కాపాడుకునే శక్తి ఉంది. అది ఎంతలా అంటే కొన్ని వేల ఏళ్ల నుంచి కూడా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. ఎందరో ముష్కరులు దాడి చేసినా పదిలంగానే ఉంది.
తన ప్రకాశాన్ని అలా చిమ్ముతూ వెలుగు చూడగలిగే వారికి అందిస్తూ చిరంజీవిగా కొనసాగుతోంది. సనాతన ధర్మంలోనే హిందూ ధర్మం ఉన్నది. ఈ రెండూ కూడా యుగాల నాటివే. వీటికి పుట్టుక తెలియదు, మరణం అన్నది లేదు. అలాంటి సనాతన ధర్మం గురించి చెప్పే తాహతు స్తోమత చాలా మందికి లేదు.
నమ్మితే ఆచరించడం లేకపోయినా త్యజించడం ఈ రెండింటిలో ఏది జరిగినా లాభం నష్టం ఆ వ్యక్తికి సమాజానికి తప్ప సనాతన ధర్మానికి జరిగినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. మహనీయులు ఎంతో తమ జీవితాలను త్యాగం చేశారు. ధర్మ రక్షణ కోసం కట్టుబడ్డారు. సమున్నతమైన ఆధ్యాత్మిక లక్షణాలను నిండా నింపుకుని వారు సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచారు.
ఒక రమణ మహర్షి ఆధునిక రుషి తాను సనాతన ధర్మ పరిరక్షకుడిని అని ఏనాడు చెప్పుకోలేదు అలాగే వేయి ఏళ్ళకు పూర్వం హిందూ ధర్మాన్ని మరింతగా పటిష్టం చేయడం కోసం ఒక ఆది శంకరాచార్య ఉద్భవించారు. ఇలా ఎందరో మహాత్ములు చరిత్ర లోతులలోకి వెళ్తే కనిపిస్తారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే సనాతన ధర్మం అంటే ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ప్రశాంతతతో కూడిన జీవనం. నమ్మిన దైవాన్ని ఆచిరిస్తూ రుజు మార్గంలో ముందుకు సాగడం అన్నది సూక్ష్మంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సనాతన ధర్మం లోతులను చూసిన వారు కూడా తామే పరిరక్షకులమని చెప్పలేదు. కాలాలకు అతీతంగా అది ఉంది.
ఎప్పటికీ వాడిపోని తీరున ఆ ధర్మం సాగుతోంది. సనాతన ధర్మం హిందూ జీవన విధానం అన్నవి ఎవరికైనా నమ్మి ఆచరించేందుకు వీలుగా ఉన్నవే. ఇక భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఈ రోజున ఇదే జీవన విధానం అమలు అవుతోంది అంటే అది తెలియకుండానే వారికి వారు సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లుగానే లెక్క.
సనతన ధర్మాన్ని రక్షించడం అన్న మాటే విడ్డూరంగా ఉంది. సనాతనం అన్న అర్ధాన్ని అవహేళన చేస్తున్నట్లుగా ఉంది. నాశనం లేని దాన్ని నాశనం చేయగలిగే శక్తి ఎవరికి ఉంది. అలా అనుకోవడంలోనే పిచ్చి భ్రమలు ఉన్నాయి. అందువల్ల సనాతన ధర్మానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు
వారిని సూడో సెక్యులర్ వాదులు కాదు సూడో హిందూత్వ వాదులు అని కూడా ఇపుడు చెప్పాల్సి ఉంటోంది. ధర్మం ఎపుడూ కాలానికి అతీతంగా ఉంటుంది. అది అలా ప్రయాణిస్తూ తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. సూర్యుడిని వెలుగు నివ్వు అని చెప్పడం ఎలాంటి వెర్రితనమో ధర్మాన్ని అలాగే కోరడం పిచ్చితనం.
రాజకీయ నేతలకు పడి కట్టు పదాలు కావాలి. కొత్త మాటలు కావాలి. జనాలను ఆకర్షించేందుకు శత కోటి వేషాలు కావాలి. ఇలాంటి వారి మాటలలో చేతలో పడి కూడా సనాతన ధర్మం ఏమైపోతుందో అన్న బాధ అంతకంటే అవసరం లేదు.
రాజకీయ లబ్ది కోసం పార్టీలు నాయకులు చేసే వికృత విన్యాసాలు విపరీత పోకడలను చూసి కూడా ధర్మం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రంగులు రుచులు చూసుకుని ఏ గోటి కాడ ఏ పాట ఏ ఒడ్డున ఏ మాట ఆడాలో నేర్చిన నయా రాజకీయ వాదులు ఏమీ సనాతన ధర్మాన్ని రక్షించేటంత మొనగాళ్ళు కానే కాదు.
ఇది చరిత్ర చెప్పిన సత్యం. నమ్మిన ధర్మం పట్ల ఆచరణ ఉండాలి. నాతి చరామి అన్న మాటకు అర్థం తెలియాలి. వివాహం దైవికమైన బంధం అని సనాతన ధర్మం చెబుతోంది. మరి గావు కేకలు పెడుతున్న వారు దానిని ఆచరించి చూపుతున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.
అసత్యాలు అబద్ధాలకు దూరంగా ఉంటూ రుజు వర్తనతో ముందుకు సాగే ప్రతీ ఒక్కరూ ధర్మాన్ని రక్షిస్తున్నట్లే. అలా కాని వారు ఎన్ని నామాలు పెట్టుకుని గగ్గోలు పెట్టినా ధర్మానికి ఏమీ కాదు కానీ వారు మాత్రం వింత జీవులుగానే చివరికి మిగులుతారు