రాజకీయ సన్యాసం...నయా ట్రెండ్ !
సన్యాసి అన్నవాడు అన్నీ త్యజించాల్సిందే. సన్యసించిన తరువాత మమతానురాగాలు ఉండవు, రాగద్వేషాలు అంతకంటే ఉండవు.
By: Tupaki Desk | 2 Feb 2025 5:10 PM GMTసన్యాసి అన్నవాడు అన్నీ త్యజించాల్సిందే. సన్యసించిన తరువాత మమతానురాగాలు ఉండవు, రాగద్వేషాలు అంతకంటే ఉండవు. తమ మీద తమకు ఆసక్తి చంపుకుంటూ జీవించడమే అలవాటు చేసుకుంటారు. సన్యాసి అయిన వాడు తిరిగి సంసారి కాలేడు. కానీ సంసారి విసిగి వేసారి సన్యాసి కావచ్చు. అయితే ఈ తరహా వారు తిరిగి సంసారిక జీవితం మీద ప్రపంచం లౌకిక జీవితం మీద మోజు పెంచుకునేందుకు ఆస్కారాలు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
ఎందుకంటే అది పూర్వరంగం. దాని మీద అంత తేలిగ్గా అపేక్ష అనురాగం పోదు. ఇపుడు రాజకీయ రంగంలో చూస్తే ఈ నయా ట్రెండ్ స్టార్ట్ అయిందా అన్న చర్చ సాగుతోంది. రాజకీయాల్లో ఉంటూ అనుకున్నది జరగకపోవడమో లేక తమకే విరక్తి కలగడమో కారణాలు ఏమి అయితేనేమి రాజకీయాలకు స్వస్తి అంటూ సన్యాసం స్వీకరిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి ఆ పార్టీ అభివృద్ధి కోసం విభజన ఏపీలో తన వంతుగా ఎంతో కృషి చేసిన ఎన్ రఘువీరారెడ్డి 2019 ఎన్నికల తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన ఒక సాధారణ రైతుగా మారి తన పొలంలో పనిచేస్తూ కనిపించారు. ఆయన ఈ రాజకీయం ఇక చాలు అని కూడా అనేశారు. అయితే రాజకీయం మాత్రం ఆయనను వదలలేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వర్కింగ్ కమిటీలో ఆయనకు చోటు ఇచ్చి గౌరవించింది. అయినా పూర్వం మాదిరిగా ఆయన దూకుడు రాజకీయం మాత్రం చేయడం లేదు.
మరి కొందరు నాయకులు చెప్పకపోయినా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వారిలో రాయలసీమ కర్నూలు జిల్లాకు చెందిన పెద్దాయన బీసీ నేత కేఈ క్రిష్ణమూర్తి. ఎనిమిది పదుల వయసులో ఉన్న ఆయన దాదాపుగా రాజకీయాలకు స్వస్తి అనేసినట్లే అంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో గెలిచారు. కానీ గతంలో అంత చురుకుగా లేరు. ఈ దఫాతో ఆయన కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతారు అని టాక్ అయితే నడుస్తోంది.
కోస్తా జిల్లాల విషయానికి వస్తే విజయవాడ లాంటి చోట రెండు సార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా 2024 ఎన్నికల ఫలితాల తరువాత ప్రకటించారు. ఆయన రాజకీయ జీవితం ఇక చాలు అని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం అయినా రాజకీయాల్లోకి తిరిగి వస్తారని అనుచరులు ఆశలు అయితే పెట్టుకున్నారు.
ఇక ఇదే విధంగా రెండు సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు స్వస్తి అని దశాబ్దం క్రితమే ప్రకటించి ఆ మాట మీదనే ఉన్నారు. ఆయన రాజకీయ నీడ తన మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజంగా అలా ఉండడమూ గొప్పే అని అంటున్నారు.
గోదావరి జిల్లాలకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని రాజకీయాలకు దూరం అని కొంతకాలం క్రితం ప్రకటించారు. కానీ ఆయన టీడీపీలో చేరడానికి చూస్తున్నారు అని ప్రచారంలో ఉన్నా అది సాకారం అయితే కావడం లేదు. ఇక ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బయటకు చెప్పకపోయినా రాజకీయాలకు దూరం అనే అంటున్నారు. ఆయనకూ వారసుడి కోసం ఆరాటం ఉంది. అలా మళ్ళీ రాజకీయాల పట్ల ఆసక్తిని చూపించవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా రాజకీయాలకు దగ్గరా దూరమా అంటే ఎవరూ చెప్పలేని స్థితిలో ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో నంబర్ టూగా చలామణీ అయిన వి విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అని అతి పెద్ద నిర్ణయాన్నే తీసుకునారు. అయితే ఆయన ఎంతకాలం ఆ విధంగా ఉంటారు అన్న చర్చ కూడా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సి ఉంది. రాజకీయాల్లోకి ఒక్కసారి వస్తే కనుక దాని నుంచి తప్పించుకోవడం కష్టమే. అది ఇంట్లో ఒంట్లో కూడా ప్రవేశిస్తుంది. అయితే రాజకీయ సన్యాసం అన్న మాట గంభీరంగా ఇస్తున్న నినాదమా లేక అది విధానామా లేక అది వ్యూహాత్మకమా అన్న చర్చ కూడా సాగుతోంది.