Begin typing your search above and press return to search.

అనుకున్న స‌మ‌యానికే పోలింగ్‌.. కానీ, అడుగ‌డుగునా ఇబ్బందులే

దీంతో ఆయా కేంద్రాల్లో 20 నుంచి 40 నిఇషాల‌పాటు ఆల‌స్యంగా పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:17 AM GMT
అనుకున్న స‌మ‌యానికే పోలింగ్‌.. కానీ, అడుగ‌డుగునా ఇబ్బందులే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ గురువారం ఉదయం నిర్దేశిత స‌మ‌యానికే ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌లకు ఈ పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖులు , రాజ‌కీయ నేత‌లు కూడా ఉద‌యాన్నే పోలింగ్ బూత్‌ల‌కు క్యూ క‌ట్టారు. అయితే.. చాలా జిల్లాల్లో అనేక ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా కేంద్రాల్లో 20 నుంచి 40 నిఇషాల‌పాటు ఆల‌స్యంగా పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

ధర్మపురిలోని 39వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించ‌డంతో కొద్దిసేపు పోలింగ్ ప్ర‌క్రియ నిలిచిపోయింది. ఇక‌, సిద్దిపేటలోని ఆంబిటస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నంబ‌రు 118 లో ఈవీఎం మొరాయించింది. దీంతో వేరేదానిని ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ బూత్ నెంబర్ 89లో ఈవీఎం మొరాయించింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందిపేట మండల కేంద్రంలో 167 పోలింగ్ బూత్‌లోను, నాగార్జునసాగర్ 103 పోలింగ్ బూత్‌లో కూడా ఈవీఎం మొరాయించింది.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మోరాయించ‌డంతో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభ‌మైంది. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఈవీఎం మొరాయించ‌డంతో 30 నిమిషాలు ప్ర‌క్రియ‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. హనుమకొండ పరిధిలోని మర్కజీ స్కూల్‌లో ఓ ఈవీఎం మొరాయించింది. దీంతో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసే స‌రికి 40 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింది.

ఫోన్ల‌తోనూ ఇబ్బంది..

సెల్ ఫోన్లు డిపాజిట్ చేసుకునే సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో కూడా ఓట‌ర్లు ఇబ్బంది ప‌డ్డారు. పోలింగ్ బూత్‌ల‌కు ఉద‌యాన్నే వ‌చ్చిన‌.. కొంద‌రు యువ‌త త‌మ‌తో పాటు సెల్ ఫోన్ల‌ను తీసుకువ‌చ్చారు. అయితే.. నిబంధ‌న‌ల మేర‌కు ఫోన్ల‌ను బూత్‌ల‌లోకి అనుమ‌తించ‌లేదు. అలాగ‌ని.. బూత్‌ల‌లోనూ వాటిని భ‌ద్ర‌త ప‌రుచుకునే ఏర్పాట్లు చేయ‌లేదు. దీంతో యువ‌త, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు వెన‌క్కి వెళ్లిపోయాయి.

జిల్లాల్లో తీరు ఇదీ..

న‌గ‌రాలు ప‌ట్ట‌ణాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌లో జిల్లాల్లో స్పంద‌న బాగా క‌నిపిస్తోంది. ఉద‌యం 6 గంట‌ల‌కే గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు పోలింగ్ బూత్‌ల‌కు క్యూ కట్టారు. కొంద‌రు కాలి న‌డ‌క‌న బూత్‌ల‌కు వ‌చ్చారు. ఆదిలాబాద్‌లో బూత్‌ల‌కు, తండాల‌కు మ‌ధ్య 20 కిలో మీట‌ర్ల దూరం ఉండ‌డం.. ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ .. ఉద‌యాన్నే ప్ర‌జ‌లు ఆయా బూత్‌ల‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రంగారెడ్డిలో యువ‌త ఎక్కువ‌గా బూత్‌ల వ‌ద్ద క‌నిపించారు. మ‌రోవైపు.. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వికాస్‌రాజ్‌.. ఎస్సార్ న‌గ‌ర్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.