Begin typing your search above and press return to search.

పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టిందా ?

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం

By:  Tupaki Desk   |   11 Oct 2023 5:30 PM GMT
పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టిందా ?
X

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. కులసంఘాలతో సమావేశం అవ్వటం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు లేదా వాళ్ళ లీడర్లతో సమావేశాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గుండుగుత్తగా తమకే ఓట్లు వేసేట్లుగా ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులు వీళ్ళతో బేరాలు మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. ప్రతి ఎన్నికల సమయంలోను ప్రతి పార్టీ చేసేదిదే. కాకపోతే రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత కీలకంగా మారింది.

కాబట్టి బేరాలు కాస్త ఉదారంగాను, గట్టిగానే సాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తమకే ఓట్లేయిస్తే అడిగినంత ముట్టచెప్పేట్లుగా అధికారపార్టీ బేరాలకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. బేరాలు ఫైనల్ అయిన దగ్గర నుండి ఆ గ్రూపులు, కులసంఘాల ఓట్లు పక్కకుపోకుండా పార్టీ తరపున ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా ఎంఎల్ఏలు నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ సమన్వయకర్తలే కులసంఘాలు, మహిళా సంఘాలతో రెగ్యులర్ టచ్ లో ఉంటారు.

రాష్ట్రం మొత్తంమీద 1.77 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో సుమారు 18 లక్షల మంది మహిళలున్నారు. వీళ్ళంతా దాదాపు ఓటర్లే. వీళ్ళందరితో నియోజకవర్గాల వారీగా దసరా పండుగ లోపుల ప్రత్యేకంగా సమావేశమవ్వాలని ఎంఎల్ఏలకు పార్టీ పరంగా ఆదేశాలు వచ్చాయట. డ్రాక్రా గ్రూపులతో మాట్లాడే బేరాలు ఎలాగుంటున్నాయంటే అభ్యర్ధులకు వీళ్ళే ప్రచారం కూడా చేసేట్లుగా. ఓటర్ స్లిప్పులు వెరిఫై చేయటం, ఓటర్ల ఇళ్ళకు రెండుమూడుసార్లు వెళ్ళటం, అభ్యర్ధులకు అనుకూలంగా ప్రచారం చేయటం, పోలింగ్ రోజున వీళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకురావటం అనే ప్యాకేజీ రూపంలో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఇలాంటి ప్యాకేజీల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయట.

కేసీయార్ పోటీచేయబోతున్న కామారెడ్డి నియోజకవర్గంలో మహిళా సంఘాలతో ఇప్పటికే మొదటివిడత సమావేశం పూర్తియినట్లు పార్టీవర్గాల టాక్. ఒక్కో గ్రూపుకు రు. 5 లక్షలు ఇవ్వటానికి అధికారపార్టీ నేతలు సిద్ధపడినట్లు సమాచారం. ప్రతి పది గ్రూపులకు పార్టీ తరపున ఒక నేతను ఇన్చార్జిగా పార్టీ నియమించిందట. ఇదే పద్దతిలో కులసంఘాలతో కూడా సమావేశాలుంటాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.