Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీకి సిట్ ఇచ్చిన 150 పేజీలో రిపోర్టు సారాంశమిదే!

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని రీతిలో ఏపీలో పోల్ హింస చోటు చేసుకోవటం తెలిసిందే

By:  Tupaki Desk   |   21 May 2024 4:45 AM GMT
ఏపీ డీజీపీకి సిట్ ఇచ్చిన 150 పేజీలో రిపోర్టు సారాంశమిదే!
X

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని రీతిలో ఏపీలో పోల్ హింస చోటు చేసుకోవటం తెలిసిందే. బ్రాండ్ ఏపీని దారుణంగా దెబ్బ తీసిన ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలమైందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోటు చేసుకున్న హింస.. తదనంతర పరిణామాలు.. పోలీసుల తీరుతో పాటు.. పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. పలువురు ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేసిన దరిమిలా.. ఏపీలోని పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని కోరింది.

ఈ నేపథ్యంలో పోల్ హింస చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించిన సిట్ అధికారుల టీం.. అక్కడి వారిని కలుసుకొని.. వివరాలు సేకరించారు. 150 పేజీల రిపోర్టును తాజాగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. సిట్ అధిపతిగా వ్యవహరించిన వినీత్ బ్రిజ్ లాల్.. ఎస్పీ రమాదేవిలు ఏపీ డీజీపీని కలిసి తమ రిపోర్టును ఆయన చేతికి ఇచ్చారు. ఇంతకూ సదరు రిపోర్టులో ఏముంది? హింస ఏ స్థాయిలో చోటు చేసుకుంది? దీనికి ప్రతిగా పోలీసుల స్పందన ఏమిటి? అన్న వివరాల్ని సమగ్రంగా తమ రిపోర్టులో పేర్కొన్నట్లుగా చెప్పాలి.

రిపోర్టులో పేర్కొన్న ముఖ్యాంశాల్ని చూస్తే..

- ఆరు నియోజకవర్గాల పరిధిలో చోటు చేసుకున్న తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబందించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పల్నాడు జిల్లాలోని మాచర్ల.. నరసరావుపేట.. గురజాల నియోజకవర్గా పరిధిలో 22 కేసులు.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి.. తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన నాలుగు కేసులు.. తాడిపత్రి పరిధిలో నమోదైన ఏడు కేసులను సిట్ టీం సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాల్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు.. బాధితులతో మాట్లాడి వివరాల్ని సేకరించాయి.

- హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా సంబంధిత కేసుల్లో పెట్టాల్సిన సెక్షన్లు పెట్టారా? లేదా? నిందితులు అందరిని గుర్తించారా? లేదా? అన్న అంశాలపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత సెక్షన్లను ఉటంకిస్తూ వెంటనే వాటిని వర్తింపజేస్తూ కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించారు.

- మొత్తం 33 కేసుల్లో 1370 మంది నిందితులు ఉంటే వారిలో 731 మందినే గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఆయా కేసుల్లో 124 మందినే అరెస్టు చేశారు. 94 మందిని అరెస్టు చేయకుండా సీఆర్ పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు.. అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లుగా తమకు తెలిపినట్లుగా నివేదికలో పేర్కొన్నారు.

- మాచర్ల.. నరసరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు.. వాహనాల దహనాలు.. రాళ్లు విసురుకోవటం లాంటి ఘటనలతో హింస పెచ్చరిల్లింది. వాటిల్లో తీవ్రమైన 18 కేసుల్లో 474 మందిని నిందితులుగా గుర్తించారు. అయితే.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు.

- అయితే.. ఈ హింసాత్మక ఘటనలకు సంబందించి 67 మందికి మాత్రం సీఆర్పీసీపీ 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు.

- గురజాల నియోజకవర్గంలోని హింసకు సంబంధించి బుక్ అయిన నాలుగు కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తించినా.. అరెస్టు చేసింది మాత్రం కేవలం 19 మందే.

- తాడిపత్రిలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి 7 కేసులు నమోదు కాగా.. దీనికి సంబంధించి 728 మంది నిందితులు ఉన్నారు. వీరిలో 91 మందినే అరెస్టు చేశారు.

- చంద్రగిరి.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో 61 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు.

- హింస చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించిన సిట్ టీంలకు పలువురు బాధితులు కంప్లైంట్లు ఇచ్చారు. వాటిని పరిశీలిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదులు.. వినతిపత్రాలకు సంబంధించిన ఘటనల్లో కేసులు నమోదు కాకుంటే వీటి ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్ లను నమోదు చేయనున్నారు.

- సిట్ రిపోర్టు ఇచ్చిన నేపత్యంలో.. సిట్ టీంతో కోఆర్డినేట్ చేసుకొని ఈ కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలు.. రేంజ్ డీఐజీలతో పాటు గుంటూరు ఐజీకి ఆదేశాలు జారీ చేశారు.

- హింస చెలరేగిన జిల్లాల్లో పల్నాడు మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో (నరసరావుపేట, మాచర్ల, గురజాల) హింస చెలరేగింది. అత్యధిక కేసులు (10) నరసరావుపేటలో నమోదయ్యాయి. ఎనిమిది కేసులు నమోదైన మాచర్లలో నిందితుల సంఖ్య 296 కావటం గమనార్హం.

- అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఒక్క నియోజకవర్గం (తాడిపత్రి)లో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది. దీనికి సంబంధించి 7 కేసులు నమోదు కాగా.. ఈ కేసుల్లో నిందితుల సంఖ్య ఏకంగా 728 మంది కావటం విశేషం. ఇందులో 296 మందిని గుర్తించగా.. మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. వీరిలో అరెస్టు అయిన వారు 91 మంది మాత్రమే. అరెస్టు కావాల్సిన వారు మరో 634 మంది ఉన్నట్లుగా తేల్చారు.