'నాటుబాంబు, లక్ష్మీబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబే'!
అవును... వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 7 Nov 2024 5:56 PM GMTగత నెలలో సియోల్ పర్యటనలో ఉన్న సమయంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా... తెలంగాణలో ఒకటో రెండో బాంబులు పేలబోతున్నాయని అన్నారు. తాము సియోల్ లో ఉండగానో.. లేకపోతే హైదరాబాద్ కు వెళ్లిన మరుసటి రోజో పొలిటికల్ బాంబులు పేలే అవకాశాలున్నాయని అన్నారు.
ఇదే సమయంలో... కాళేశ్వరం, ధరణి, టెలీఫోన్ ట్యాపింగ్... ఇలా సుమారు 10 అంశాల వారీగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై విచారణ చేపడుతున్నామని.. తొందరపాటుకు ఏమాత్రం అవకాశం లేకుండా, కక్షపూరిత చర్యలకు ఆస్కారం లేకుండా సరైన సాక్ష్యాధారాలతో నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో.. తొందరలోనే తెలంగాణలో బాంబుల మోత కన్ఫాం అని అనుకున్నారు చాలా మంది!
అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి సుమారు రెండు వారాలు అవుతున్నా.. ఇప్పటికీ చిన్న సైజు దీపావళి గన్ సౌండ్ కూడా రాకపోవడంతో ఇదంతా రాజకీయ వ్యాఖ్యలే అనుకున్నారు! అయితే... తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఏకంగా.. ఆటమ్ బాంబులే అంటూ స్పందించారు.
అవును... వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... త్వరలో ఆటమ్ బాబు పేలుతుందని అన్నారు. తప్పు చేసిన వాళ్లకు నాటుబాంబు కాదు.. లక్ష్మీబాబు కాదు.. ఆటమ్ బాంబు పేలబోతోంది.. జనం సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు పంపారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో... ఎంతపెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదని.. రూ.55 వేల కోట్లు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామని.. తప్పు చేయని వాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని.. వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో... తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఈ బాంబుల కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి! ఏ విషయంలో బాంబులు పెరగబోతున్నాయో అంటూ ఊహాగాణాలు హల్ చల్ చేస్తున్నాయి!