కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ రెడీ: పొంగులేటి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ గా కూడా ఉన్న పొంగులేటి పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
By: Tupaki Desk | 18 Nov 2023 4:12 PM GMTకాంగ్రెస్ నాయకుడు, బీఆర్ ఎస్ మాజీ నేత, ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్‌ను రెడీ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పొంగులేటి అన్నారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-కన్వీనర్ గా కూడా ఉన్న పొంగులేటి పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
‘‘కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అహంకారానికి పోకుండా పని చేయాలి. 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి. 10 రోజుల్లో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్‌ల వరకు తీసుకువెళ్లాలి.’’ అని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. ‘అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదు`` అని వ్యాఖ్యానించారు. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లిలో వస్తుందని పొంగులేటి అన్నారు.
``డబ్బుతో రాజకీయం చేయలేం.. అది సాధ్యం కాదు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరు. డబ్బుతో రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఉద్యోగస్తులను జనం మీదకు పంపి వాళ్లను మార్చాలనుకోవటం అమాయకత్వం. కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 9 తర్వాత తొత్తులకు, కబ్జాదారులకు అర్థం అవుతుంది`` అని పొంగులేటి తీవ్ర విమర్శలు గుప్పించారు.