Begin typing your search above and press return to search.

పొంగులేటికి షాక్‌... న‌మ్మిన‌బంటుకు నో చెప్తున్న కాంగ్రెస్ పెద్ద‌లు!

కాంగ్రెస్ పెద్ద‌లు రెండో జాబితా ఆలస్యానికి ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపేనని కార‌ణంగా మారింద‌ని, ఇందులో పొంగులేటికి షాకిచ్చే ప‌రిణామం కూడా ఉంద‌ని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:01 AM GMT
పొంగులేటికి షాక్‌... న‌మ్మిన‌బంటుకు నో చెప్తున్న కాంగ్రెస్ పెద్ద‌లు!
X

తెలంగాణ రాజ‌కీయాల్లో టికెట్ల కేటాయింపు అంశం ర‌స‌వ‌త్తరంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి లాంటి సీనియ‌ర్ నేత త‌న‌కే తొలి లిస్ట్‌లో పేరు ద‌క్క‌క‌పోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇలాంటి ప‌రిస్థితే మాజీ ఎంపీ, ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అది ఆయ‌న టికెట్ విష‌యంలో కాదు...పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య విష‌యంలో!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో మొదటి విడతలో ప‌లువురు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్ట్‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. అయితే, ఈ ద‌ఫా అభ్యర్థుల ఖరారు విషయంలో కాంగ్రెస్ పెద్ద‌లు ఊహించని మార్పులు, చేర్పులు చేసే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. ఇందుకు ప్రధాన కార‌ణం ముఖ్య‌ నేతలంతా తమ తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలని పట్టుబట్టడం... ఇందులో పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సైతం ఉండ‌టం. దీంతో ఆయ‌న న‌మ్మిన‌బంటుకు టికెట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు.

ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పొంగులేటి అనుచ‌రుడైన కోరం కనకయ్య దరఖాస్తు చేసుకున్నారు. తన అనుచరుడైన కోరం కనకయ్యకే ఈ సీటు ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే, ఇల్లందు నుంచి పోటీ ప‌డేందుకు మ‌రో 32 మంది సైతం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేస్తోంది. దీనికి కార‌ణం ఈ 32 మందిలో ముఖ్య‌మైన వ్య‌క్తి అయిన మాజీ మంత్రి బలరాం నాయక్. రెండో విడత జాబితాలో బలరాం నాయక్‌ను ఇల్లందు నుంచి బ‌రిలో దించే విష‌యాన్ని ఏఐసీసీ సీరియ‌స్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పెద్ద‌లు రెండో జాబితా ఆలస్యానికి ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపేనని కార‌ణంగా మారింద‌ని, ఇందులో పొంగులేటికి షాకిచ్చే ప‌రిణామం కూడా ఉంద‌ని అంటున్నారు. మూడు రోజులుగా ఏఐసీసీ కార్యాల‌యం ఎదుట ఇల్లందు కాంగ్రెస్ ఆశావాహుల ఆందోళన చేస్తూ కనకయ్యకు టికెట్ కేటాయించొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో అధిష్టానం క‌నకయ్య అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడుతోందని, బ‌ల‌రాంనాయ‌క్ వైపే మొగ్గు చూపుతోంద‌ని అంటున్నారు. ఇలా జ‌రిగితే కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాల్లో పొంగులేటికి షాక్ ఖాయ‌మ‌ని చెప్తున్నారు.