Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పెద్ద‌ల‌కు పొంగులేటి షాక్‌.. భారీ లిస్ట్‌తో పొంగులేటి గేమ్

సీనియ‌ర్ల ఓ వైపు, బీసీ నేత‌లు మ‌రోవైపు త‌మ త‌మ ప్రాధామ్యాల‌ను వివ‌రిస్తుంటే...ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త‌న మార్క్ చూపే ప‌నిలో ప‌డ్డారు.

By:  Tupaki Desk   |   30 Sep 2023 12:45 PM GMT
కాంగ్రెస్ పెద్ద‌ల‌కు పొంగులేటి షాక్‌.. భారీ లిస్ట్‌తో పొంగులేటి గేమ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల గుడ‌వు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది రాజకీయం రంజుగా మారుతోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీల‌లో టికెట్ల గేమ్ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది. సీనియ‌ర్ల ఓ వైపు, బీసీ నేత‌లు మ‌రోవైపు త‌మ త‌మ ప్రాధామ్యాల‌ను వివ‌రిస్తుంటే...ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త‌న మార్క్ చూపే ప‌నిలో ప‌డ్డారు. ఏకంగా ఓ భారీ లిస్ట్‌తో అధిష్టానం అవాక్క‌య్యేలా చేశారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ల‌కు త‌న రేంజ్ రుచి చూపించేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.

బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి త‌ర్జ‌న భ‌ర్జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర తప్పా.. మిగతా అన్ని నియోజకవర్గాలను తన వర్గీయులకే ఇవ్వాలని పొంగులేటి కాంగ్రెస్ పెద్ద‌ల వ‌ద్ద డిమాండ్ ఉంచిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. తనతో పాటు అనుచరులు క‌లిసి పార్టీలో చేరుతున్నందుకు మొత్తం పది టికెట్లను కేటాయించాల‌ని కోరిన‌ట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆ డిమాండ్‌ను పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి మ‌రింత క్రేజీగా మార్చార‌ని స‌మాచారం. త‌న‌తో క‌లిసి పార్టీలో చేరిన వారికే కాకుండా ఇప్ప‌టికే పార్టీలో ఉన్న‌ మ‌రికొంత మంది నేత‌ల‌కు సైతం టికెట్లు కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీలో తన పట్టును మరింతగా పెంచుకునే వ్యూహంలో భాగంగా పార్టీలో చేరిక స‌మ‌యంలో తన వెంట వచ్చిన వారే కాకుండా.. అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కూడా పొంగులేటి టికెట్ అడిగినట్లు స‌మాచారం. మొత్తం 13 నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వాలని కోరిన పొంగులేటి.. త‌న మాట‌కు ఓకే చెప్తే...వారిని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

పొంగులేటి తాజా జాబితాలో ఖమ్మం/కొత్తగూడెం/పాలేరుల‌లో ఏదైనా ఓ చోటు నుంచి త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించిన అభ్యర్థులో ఇల్లందు – కోరం కనకయ్య, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట – జారె ఆదినారాయణ, వైరా – విజయా భాయ్, సత్తుపల్లి – కొండూరు సుధాకర్, మహబూబాబాద్ – మురళీ నాయక్, డోర్నకల్ – రాంచందర్ నాయక్, శేరిలింగంపల్లి – రఘునాథ్ యాదవ్, చెన్నూరు – డా. రాజా రమేష్, పాలకుర్తి – ఝాన్సీ రెడ్డి, కంటోన్మెంట్ – పిడమర్తి రవి, సూర్యాపేట – పటేల్ రమేష్ రెడ్డి పేర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఉంచిన ఈ ప్ర‌తిపాద‌న‌కు పెద్ద‌లు ఓకే చెప్తారో లేదో తెలియాలంటే... మ‌రికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.