Begin typing your search above and press return to search.

వియ్యంకుడి సీటుతో పాటు 3 అసెంబ్లీ టికెట్లకు మాజీ ఎంపీ దరఖాస్?

రాజకీయ అనుభవం మహా అంటే పదేళ్లే.. ప్రజా ప్రతినిధిగా గెలిచింది ఒక్కసారే.. మాజీగా మారి కూడా ఐదేళ్లవుతోంది..

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:30 PM GMT
వియ్యంకుడి సీటుతో పాటు 3 అసెంబ్లీ టికెట్లకు మాజీ ఎంపీ దరఖాస్?
X

రాజకీయ అనుభవం మహా అంటే పదేళ్లే.. ప్రజా ప్రతినిధిగా గెలిచింది ఒక్కసారే.. మాజీగా మారి కూడా ఐదేళ్లవుతోంది.. కానీ, ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టు.. అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఆయన పార్టీ మారితే వెంట భారీ నాయక గణమే వచ్చింది. ఇదంతా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి. ఉమ్మడి ఖమ్మంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఒక్క సీటూ దక్కనివ్వనంటున్న ఆయన కాంగ్రెస్ లో చేరిన వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. దీనికితగ్గట్లే ఆ పార్టీ కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

మూడు జనరల్ స్థానాలూ

10 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి ఖమ్మంలో ఉన్నవి మూడే జనరల్ స్థానాలు. అవి కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు. వాస్తవానికి గత ఎన్నికల్లో పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్సే గెలిచింది. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాలు ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నవి. అలాంటిది కొత్తగూడెంలో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పాలేరులో నెగ్గిన కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కు పెద్ద షాక్ అయింది. కాగా, జూలైలో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి తన వర్గానికి ఉమ్మడి ఖమ్మంలో 6 నుంచి 8 సీట్లు అడిగినట్లు ప్రచారం జరిగింది. ఇందలో వాస్తవం ఎంతో తెలియదు కాని.. ఆయన వర్గానికి సముచిత ప్రాధాన్యం దక్కడం మాత్రం ఖాయం. ఇక పొంగులేటి బుధవారం తాను ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో పోటీకి ఉత్సాహంగా ఉన్నట్లు పీసీసీకి దరఖాస్తు సమర్పించారు.

పాలేరులో వియ్యంకుడికి వద్దా?

ఖమ్మం పక్కన ఉండే డోర్నకల్ కు చెందిన భూస్వామి రామసహాయ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి స్వయంగా పొంగులేటికి వియ్యంకుడు. సురేందర్ రెడ్డి పాతికేళ్ల కిందటే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. రఘురామిరెడ్డి రాజకీయాలలోనే లేరు. అయితే, కీలక ఎన్నికల ముంగిట రఘురామిరెడ్డి పాలేరు టికెట్ ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొంగులేటి తరఫున అయితే ఇబ్బందులు వస్తాయని.. ఆయన పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోటాలో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, తాజాగా పొంగులేటి పాలేరులో కూడా పోటీకి ఉత్సాహం చూపడం గమనార్హం.

ఎక్కడైతే ఉత్తమమో..?

సామాజిక, రాజకీయ, భౌగోళిక సమీకరణాల రీత్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు అయితేనే ఉత్తమమనేది ఓ అంచనా. ఖమ్మంలో మంత్రి పువ్వాడ్ అజయ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి. కొత్తగూడెంలో బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడవల్లి క్రిష్ణ కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. మూడు జనరల్ స్థానాల్లో బీసీకి ఒకటైనా ఇవ్వాలి. బీఆర్ఎస్ అదే పనిచేసింది. క్రిష్ణ గతంలోనూ కొత్తగూడెంలో పోటీ చేసి ప్రభావం చూపారు. కొత్తగూడెం కాంగ్రెస్ అడ్డానే అయినా.. పొంగులేటికి అంత పట్టు లేదు. పాలేరులో మాత్రం అన్నీ అనుకూలాంశాలే కనిపిస్తున్నాయి.

మరి షర్మిల సంగతో..?

అన్న ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ లో పార్టీ పాదయాత్ర కూడా చేసిన వైఎస్ షర్మిల మొదటినుంచీ పాలేరులో పోటీకి దిగుతానంటూ హడావుడి చేశారు. కానీ, చివరకు ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే జరిగితే.. షర్మిలకు పాలేరు టికెట్ దక్కుతుందా..? లేక కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను ఏపీ రాజకీయాలకు తురుపుముక్కగా వాడుకుంటుందా? అనేది చూడాలి. మొత్తానికి పొంగులేటికి పాలేరు, ఖమ్మంలలో ఏదో ఒక టికెట్ దక్కే అవకాశాలే ఉన్నాయి.

కొసమెరుపు..: వియ్యంకుడు రఘురామిరెడ్డికి గనుక పాలేరు టికెట్ వచ్చి.. పొంగులేటికి ఖమ్మం సీటు లభిస్తే వియ్యంకులిద్దరూ పక్కపక్క నియోజకవర్గాల్లో పోటీచేసినట్లవుతుంది.