Begin typing your search above and press return to search.

కేసీఆర్ నైతిక హక్కులపై పొంగులేటి ప్రశ్న... తెరపైకి కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేళుతున్నాయి

By:  Tupaki Desk   |   2 Nov 2023 11:55 AM GMT
కేసీఆర్ నైతిక హక్కులపై పొంగులేటి ప్రశ్న... తెరపైకి కీలక వ్యాఖ్యలు!
X

తెలంగాణలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకీ వేడెక్కుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేళుతున్నాయి. మరి ముఖ్యంగా బీఆరెస్స్ - కాంగ్రెస్ నేతల మధ్య ఒకటికి పది మాటల యుద్ధం నడుస్తుంది. ఇందులో భాగంగా... తాజాగా కేసీఆర్ - పొంగులేటి మాధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో నడించింది. కేసీఆర్ తనపై చేసిన ప్రతీమాటకూ పొంగులేటి కౌంటర్స్ ఇస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అవును... తాజాగా బీఆరెస్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో పర్యటించిన కేసీఆర్... స్థానిక కాంగ్రెస్ నేతలపై ఫైరయిన సంగతి తెలిసిందే. జేబులోకి నాలుగు డబ్బులు వచ్చే సరికి విచక్షణ కోల్పోతున్నారని... ప్రజలంతా విచక్షణతో ఆలోచించాలని, డబ్బుతో రాజకీయం చేస్తున్న స్థానిక నేతలకు తగిన బుద్ధి చెప్పాలన్నట్లుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో... ఇవన్నీ పొంగులేటిని ఉద్దేశించే కేసీఆర్ చేసిన విమర్శలు అని అంతా భావించారు!

దీంతో... కేసీఆర్ విమర్శలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. తాజాగా ఖమ్మం జిల్లా 32వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పై ఫైరయ్యారు. ఇందులో భాగంగా... ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా అవాకులు చెవాకులూ మాట్లాడారని... అరాచకంగా సంపాదించి డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంటున్నారని అంటూ... "అరాచకం అనే నైతిక హక్కు నీకు ఉందా కేసిఆర్?" అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో కేసీఆర్ లాగా, ఆయన కుటుంబ సభ్యులు లాగా... తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో డబ్బు సంపాదించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా... "డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేసే రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే కేసీఆర్" అంటూ తీవ్రస్థాయిలో ఫైరయిన పొంగులేటీ... "నోరు అదుపులో పెట్టుకోకుండా కొన్ని మాటలు మాట్లాడావ్.. అది నీ సంస్కారానికి వదిలేస్తున్నా" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు వేరు వేరు కాదు రెండు ఒక్కటే అని చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి... ఇక్కడ బీఆరెస్స్ అభ్యర్థి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని అన్నారు. ఎన్నికలు రాగానే ఆయన గురిగింజను అంటున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖమ్మంలో మరోసారి అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. ఈ క్రమంలో... ఖమ్మం ప్రజలకు అరాచక పాలన నడిపే వ్యక్తి కావాలా.. అభివృద్ధి చేసే వ్యక్తి కావాలా.. అని పంగులేటి ప్రశ్నించారు.

ఈ సమయంలో... ప్రశాంతంగా మనందరి జీవితాలు గడవాలంటే.. మన భూములు మనకే ఉండాలంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని పొంగులేటి కోరారు. అలా కాకుండా మరో వ్యక్తిని గెలిపిస్తే ఖమ్మంలో అరాచకం కొనసాగుతూనే ఉంటుందని, దానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా... ఖమ్మంలో అత్యధిక మెజారిటీతో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు.