"నువ్వు శూర్ఫణక.. నిన్ను చూస్తే.. నిద్ర కూడా పట్టదు"
రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బీఆర్ ఎస్ పార్టీ శూర్పణకకు మధ్య పోటీ జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By: Tupaki Desk | 6 March 2024 5:02 AM GMTఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి తెరమీదికి వచ్చాయి. సాక్షాత్తూ మంత్రి స్థానంలో ఉన్న నాయకులు కూడా నోరు జారుతున్నారు. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. మహిళా నాయకురాలు.. అని కూడా చూడకుండా.. బీఆర్ ఎస్ అభ్యర్థిని, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''నువ్వు శూర్ఫణక.. నిన్ను చూస్తే.. నిద్ర కూడా పట్టదు. నీకు ఎవరు ఓటేస్తారు. నున్ను చూస్తేనే.. '' అంటూ విమర్శల వర్షం కురిపించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, బీఆర్ ఎస్ పార్టీ శూర్పణకకు మధ్య పోటీ జరగబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహబూ బాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
దీనిలో పాల్గొన్న మంత్రి కార్యకర్తలను హుషారెత్తించాలని అనుకున్నారో ఏమో.. వెంటనే బీఆర్ ఎస్ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలతో విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''మార్పు రావాలి.. రాష్ట్రంలో చూశారుగా కాంగ్రెస్ అధికారంలకి వచ్చాక ఎంత మార్పు జరిగిందో. కేంద్రంలోనూ ఇందిరమ్మ రాజ్యం రావాలని నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు'' అని అన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్రంగా గోసపడ్డారని పొంగులేటి వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని, ఇటీవల మరో రెండింటిని ప్రారంభించా మని గుర్తు చేశారు. హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇదే సమయంలో ప్రస్తుత మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆమెను రామాయణంలోని రావణాసురుడి సోదరి శూర్ఫణఖతో పోలుస్తూ.. కామెంట్లు చేశారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మరోసారి మాలోత్ కవితకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.