అదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!
2014లో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరరెడ్డి ఆ తర్వాత పరిణామాలతో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Sep 2023 8:24 AM GMT2014లో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరరెడ్డి ఆ తర్వాత పరిణామాలతో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కేసీఆర్ ఎలాంటి పదవిని ఇవ్వలేదు. 2019లో మరోసారి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి టికెట్ కూడా ప్రకటించలేదు. అలాగే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రభావితం చేయగల పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయడం కాదని.. దమ్ముంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ నియోజకవర్గాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయాలని కేసీఆర్ కు చాలెంజ్ విసిరారు. కే సీఆర్ పై తాను పోటీ చేస్తానని.. ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పొంగులేటి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
ఖమ్మంలోని ఆయన ఇంటికి పొంగులేటి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లోకి వస్తే కలిసి పనిచేద్దామని ఆయనకు సూచించారు.
కల్వకుంట్ల కుటుంబ పతనం మొదలైందని పొంగులేటి వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని మర్యాద పూర్వకంగా అహ్వానించానని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని వెల్లడించారు.
జనాల కోసం పాటుపడే నాయకుడు తుమ్మల అని కొనియాడారు.
బీఆర్‌ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు శాతం ఓట్లు లేని రోజుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను బీఆర్‌ఎస్ లో చేరానని పొంగులేటి గుర్తు చేశారు. అనంతరం కొందరు కుట్ర పన్ని తనను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తారనే విషయంపై తనకు సమాచారం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కాగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నుంచి ఈసారి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన సవాళ్ల నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.