పొంగులేటికి నిరసన సెగ.. పార్టీలు మారేవారు అవసరం లేదన్న ప్రజలు!
ముఖ్యంగా తాను స్వయంగా టికెట్ ఇప్పించుకున్న వారిని గెలిపించుకునే బాధ్యతను పొంగులేటి భుజాన వేసుకున్నారు.
By: Tupaki Desk | 24 Oct 2023 2:30 AM GMTతాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ ఎంపీ.. ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అనూహ్యమైన పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, పాలేరు లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఇంతలోనే పొంగులేటికి వ్యతిరేకంగా కొందరు యువకులు, మహిళలు రోడ్లమీదకి వచ్చారు. పార్టీలు మారేవారు.. నీతులు చెబుతున్నారా?! అని రాసిఉన్న బ్యానర్లు పట్టుకుని వారు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సహా పొంగులేటి, ఆయన అనుచరులు కూడా ఖంగుతిన్నారు.
అంతేకాదు.. అక్కడకు వచ్చిన వారు.. సార్.. కాంగ్రెస్‌లో అయినా.. ఉంటారా? ఇంకో పార్టీలోకి జంప్ చేస్తారా? అని నినాదాలు చేశారు. గతంలో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా విజయం దక్కించుకున్న పొంగులేటి.. గత ఐదేళ్లలో మూడు పార్టీలు మారారు.
వైసీపీ నుంచి బీఆర్ ఎస్‌లోకి వచ్చిన పొంగులేటి తర్వాత.. కేసీఆర్‌తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారానికి దిగారు.
ముఖ్యంగా తాను స్వయంగా టికెట్ ఇప్పించుకున్న వారిని గెలిపించుకునే బాధ్యతను పొంగులేటి భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలోనే పాలేరులో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇంతలోనే ఆయనకు వ్యతిరేకంగా కొందరు రోడ్లమీదకు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే.. ఇదంతా కూడా బీఆర్ ఎస్ ఎమ్మెల్యే(కాంగ్రెస్ తరఫున గెలిచి.. తర్వాత పార్టీ మారారు) కందాళ ఉపేందర్‌రెడ్డి చేస్తున్న దుర్రాజకీయమని.. పొంగులేటి వ్యాఖ్యానించారు. తనను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని.. అందరికీ తాను ఆప్తుడినని చెప్పుకొచ్చారు. ఉద్దేశ పూర్వకంగానే తనను రెచ్చగొట్టి.. రాజకీయ గందరగోళం సృష్టించే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆంతోళనకు దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం పొంగులేటి .. తన ప్రసంగాన్ని కొనసాగించారు.