కేసీఆర్ ఇంటికి వెళ్ళి మరీ అసెంబ్లీకి ఆహ్వానం
కేసీఆర్ ఇప్పటిదాకా ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు అని అంటున్నారు. అది కూడా బడ్జెట్ సెషన్ లో కనిపించారు. ఆ తరువాత ఆయన హాజరు కావడం లేదు
By: Tupaki Desk | 7 Dec 2024 3:39 AM GMTతెలంగాణా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 9 నుంచి మొదలు కాబోతున్న తెలంగాణా అసెంబ్లీ వింటర్ సెషన్ కి హాజరవుతారా లేదా అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ ఇప్పటిదాకా ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు అని అంటున్నారు. అది కూడా బడ్జెట్ సెషన్ లో కనిపించారు. ఆ తరువాత ఆయన హాజరు కావడం లేదు.
అయితే కేసీఆర్ లాంటి పెద్దలు అనుభవజ్ఞులు సభకు రావాలని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గట్టిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆయన అంటున్నారు.
ఇక కేసీఆర్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనను అసెంబ్లీకి ఆహ్వానిస్తారు అని ప్రచారం సాగుతోంది. తెలంగాణాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ని కేసీఆర్ ఇంటికి పంపించి పెద్దాయనను సాదరంగా ఆహ్వానిస్తారు అని అంటున్నారు. అదే జరిగితే ఇక కేసీఆర్ పైనే అందరి చూపూ ఉంటుంది. కేసీఆర్ సభకు రావాల్సిందే అని జనాలు కూడా అపుడు అనుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వం నుంది అంత గౌరవంగా ఆహ్వానం వచ్చినపుడు కేసీఆర్ హాజరు కాకపోతే ఆయనదే తప్పు అన్నట్లుగా కూడా భావిస్తారు.
ఈ విధంగా చేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఇంతకీ కేసీఆర్ ఈ సెషన్ కి ఎందుకు రావాలని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పెద్దలు కోరుకుంటున్నారు అంటే అసెంబ్లీలో విపక్షం ఉంటేనే మజా అని అందరికీ తెలిసిందే. అందునా కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు సభలో ఉంటే అపుడు జరిగే చర్చలే హైలెట్ అవుతాయని అంటున్నారు.
పైగా కేసీఆర్ వంటి దిగ్గజ నేతను ఓడించిన సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఆయనను అపొజిషన్ లో చూడాలన్న కోరిక కూడా ఏడాది కాలంలోనూ తీరడం లేదు. అందుకే కేసీఆర్ ని రావాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఇక కేసీఆర్ సభకు వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కచ్చితంగా మరోసారి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎండగడతారు. అటు నుంచి కేసీఆర్ కూడా ధీటైన బదులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అలా డిబేట్ ఒక లెవెల్ లో జరిగి పొలిటికల్ హీట్ ని పెంచేందుకు ఆస్కారం ఉంటుంది.
అందుకే కేసీఆర్ ని రమ్మని కోరుతున్నారు అని అంటున్నారు. అయితే కేసీఆర్ కి ఎపుడు అసెంబ్లీకి వెళ్లాలో కూడా తెలుసు అని బీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. మరో వైపు చూస్తే బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ తన ఫాం హౌస్ లో ఈ నెల 8న ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 9 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఆయన వారికి దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. మరి ఈసారి సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అంటే అది సస్పెన్స్ అనే అంటున్నారు.