"నేరస్థులు ఎలా రక్షించబడతారో తెలుసు".. పూనమ్ లెటర్ వైరల్!
ఈ సందర్భంగా.. "మీరు చూడాలనుకుంటున్న మార్పుకోసం పోరాడండి" అంటూ గాంధీ కోట్ ను జతచేస్తూ ఎక్స్ లో ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు పూనమ్ కౌర్!
By: Tupaki Desk | 31 Aug 2024 11:30 AM GMTకృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుందనే విషయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్ లో రహస్య కెమెరాలను అమర్చారంటూ విద్యార్థినులు అందోళనకు దిగడంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ విషయం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం అవ్వడంతో విద్యార్థుల తల్లితండ్రులూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. మరోపక్క విషయం తెలిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.
ఈ దారుణ ఘటనపై అంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ సమయంలో విద్యార్థినులు, వారి తల్లితండ్రుల సమక్షంలోనే గర్ల్స్ హాస్టల్ మొత్తం తనిఖీ చేసింది పోలీసు టీమ్. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన తనిఖీల్లో... ఇక్కడ రహస్య కెమెరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అయినా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సమయంలో పూనమ్ కౌర్ స్పందించారు.
అవును... గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన తీవ్ర సంచలనంగా మారిన వేళ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఈ సందర్భంగా... ప్రియమైన అమ్మాయిలకు మీలో ఒక అమ్మాయిగా రాస్తున్నా అంటూ ఓ లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... "మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ, బయట జరుగుతున్న పరిణామాలు చూసి నేను చాలా బాధపడుతున్నాను.. మీకు ఇటీవల ఎదురైన పరిస్థితులు చాలా దారుణం" అని పూనమ్ అన్నారు.
ఈ సమయంలో విద్యార్థి సంఘాలు, అంతా ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని అభిప్రాయపడిన పూనమ్... చట్టం బలహీనులకు బలంగా, బలవంతులకు బలహీనంగా వర్తించబడుతుందనే నానుడి మనదేశంలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలలో గుర్తు తెచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ సందర్భంగా నేరస్థులు ఎలా రక్షించబడతారు.. బాధితులు ఎలా అవమానింపబడతారు అనేది తనకు చాలా అనుభవం ఉందని గుర్తుచేసుకున్నారు!
ఈ సందర్భంగా రెజ్లర్ల నిరసనను మాత్రమే గుర్తుచేయగలను.. ఇక్కడ కూడా అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలా మంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారని.. అయితే.. ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలను ఇలా ప్రమాదంలోకి నెట్టడం అనేది అసహ్యం కలిగిస్తోందని పూనమ్ తెలిపారు!
ఇదే క్రమంలో... నేరస్థులకు ఎంతటి బలవంతులు సహకరిస్తున్నా.. ఎవరినీ విడిచిపెట్టకూడదని.. వారికి గుణపాఠం చెప్పాలని.. సలహాలు ఇవ్వడం సులువే కానీ, దాన్ని అమలు చేయడం కష్టమనే విషయం తనకు తెలుసని.. అయితే ఈ మాటలు మాత్రం మనస్పూర్తిగా చెబుతున్నట్లు పూనమ్ వెల్లడించారు. ఈ సందర్భంగా మీరు చేసే పోరాటం ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుందని పూనమ్ తన లేఖలో రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా.. "మీరు చూడాలనుకుంటున్న మార్పుకోసం పోరాడండి" అంటూ గాంధీ కోట్ ను జతచేస్తూ ఎక్స్ లో ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు పూనమ్ కౌర్!