షర్మిళపై పూనమ్... తెరపైకి స్త్రీ నాయకత్వ ప్రధాన లక్షణం!
తెనాలికి చెందిన గీతాంజలి మృతి ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2024 9:47 AM GMTతెనాలికి చెందిన గీతాంజలి మృతి ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ ని తట్టుకోలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ అరోపిస్తుంది. ప్రాథమిక విచారణలోనూ అదే విషయం వెల్లడైనట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమయంలో ఆమె మరణానికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ పెరిగిపోతున్నాయి.
అవును... ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి మృతి ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ప్రజానికం కోరుతుంది! ఈ సమయంలో ఆమె మృతికి టీడీపీ, జనసేన సోషల్ మీడియా జనాలు కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే... ఆమె మరణంలో ఏదో కుట్ర దాగి ఉందని టీడీపీ, జనసేన మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.
ఇలా వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించలేదంటూ నటి పూనమ్ కౌర్ ఆన్ లైన్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న గీతాంజలి ఘటనపై వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.
"స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం... స్త్రీలు, పిల్లల పట్ల కనికరంగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదుపేస్తున్న గీతాంజలి ఘటనపై వైఎస్ షర్మిళ మౌనంగా ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెనాలిలో సామాన్య మహిళలు, బాలికలు బయటకొచ్చి వారికి పాఠం చెప్పాల్సిన అవసరం ఉంది" అని పూనమ్ ట్వీట్ చేశారు.
కాగా... ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన పూనమ్... "గీతాంజలికి న్యాయం జరగాలి. ఆమె విషయంలో అసలు ఏమి జరిగింది? గీతాంజలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఒక పార్టీకి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించడం. ఆ పసి పిల్లలు (గీతాంజలి కూతుర్లు)కు న్యాయం చేయండి" అని స్పందించిన సంగతి తెలిసిందే.