ఏపీ గురించి అంటూ ఏ4 పేజీ రాసుకొచ్చిన పూనమ్ కౌర్!
ఇందులో భాగంగా మొదట.. "ఏపీ ఈస్ ది న్యూ యూపీ!" అని ఒక ట్వీట్ చేశారు. అనంతరం ఒక పెద్ద లేఖ రాసి పోస్ట్ చేశారు పూనమ్ కౌర్.
By: Tupaki Desk | 28 April 2024 5:08 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయాయి. మరోపక్క పోలింగ్ తేదీకి డెడ్ లైన్ సమీపిస్తుండటంతో... విమర్శలు, ప్రతి విమర్శలతో వేసవి ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతుంది. ఈ సమయంలో... అనూహ్యంగా పూనమ్ కౌర్ తెరపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన రెండు వరుస ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి!
అవును... ఏపీలో ఎన్నికల వేడి తీవ్రమవుతుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... 2019 నాటి ఫలితాలు సాధించాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచిస్తుండగా... ఈ ఎన్నికల్లో 2014 నాటి ఫలితాలు వస్తాయని టీడీపీ భావిస్తుంది. మరోపక్క అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... అనూహ్యంగా పూనమ్ కౌర్ తెరపైకి వచ్చారు.
ఇందులో భాగంగా మొదట.. "ఏపీ ఈస్ ది న్యూ యూపీ!" అని ఒక ట్వీట్ చేశారు. అనంతరం ఒక పెద్ద లేఖ రాసి పోస్ట్ చేశారు పూనమ్ కౌర్. “ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పోరాట కథలు” అని హెడ్డింగ్ పెట్టిన ఆమె... ఒకప్పుడు అభివృద్ధికి దారి చూపిన ఆంధ్రప్రదేశ్.. యూపీ తరహా సమస్యలతో బాదపడుతోందని రాసుకొచ్చారు. అందుకు ప్రధానంగా గల మూడు కారణాలను ప్రస్థావించారు.
అవి.. మహిళల సమస్యలు, నేరాలు, నీటి సంక్షోభం అని.. ఈ మూడు సమస్యల విషయంలో ఏపీకి యూపీకి మధ్య సారూప్యత ఉందని చెప్పుకొచ్చారు పూనమ్. ఇదే క్రమంలో... యూపీలోని మహిళల తరహాలోనే ఏపీలోని మహిళలు లింగ ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు! గృహ హింస, వేదింపులూ ప్రబలంగా ఉన్నాయని.. మహిళా శక్తి భాగస్వామ్య రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు.
అదేవిధంగా... ఏపీలో నేరాల రేట్లు భయంకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన పూనమ్ కౌర్... ఇది యూపీ తరహా ప్రతిష్టను ప్రతిబింబిస్తుందని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లో నీటి సంక్షోభం అనేది ఉత్తరప్రదేశ్ అడుగుజాడలను అనుసరిస్తున్న మరో విధానం అని... కృష్ణా - గోదావరి నదులు తీవ్ర కాలుష్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
ఇలా.. మహిళల సమస్యలు, నేరాలు, నీటి సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పోరాటాలు దానిని ఉత్తరప్రదేశ్ గా మార్చాయని.. ఈ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడంలో రాష్ట్రం వైఫల్యం చెందిందని.. ఫలితంగా తక్షణ చర్యలు అవసరమయ్యే సంక్షోభానికి దారి తీసిందని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం, పౌరసమాజం కలిసి ముందుకు రావాల్సిన సమయం ఇది అని రాసుకొచ్చారు పూనమ్ కౌర్!