Begin typing your search above and press return to search.

దేశంలో భారీగా ఆగిన గృహప్రాజెక్టులు.. హైదరాబాద్ లో ఎన్నంటే?

డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా ప్రకారం సుమారు 5.08 లక్షల ఇళ్లు ఈ రీతిలో ఆగినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:30 AM GMT
దేశంలో భారీగా ఆగిన గృహప్రాజెక్టులు.. హైదరాబాద్ లో ఎన్నంటే?
X

హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర అధ్యయనం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా 42 నగరాల్లో గృహ ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయిన వాటికి సంబంధించిన లెక్కలు చూస్తే.. ఈ సంఖ్య ఎక్కువగాఉండటం గమనార్హం. దేశం మొత్తమ్మీదా 42 నగరాల్లో 1981 ప్రాజెక్టులు ఆగినట్లుగా నివేదిక తేల్చింది. డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా ప్రకారం సుమారు 5.08 లక్షల ఇళ్లు ఈ రీతిలో ఆగినట్లుగా చెబుతున్నారు. సదరు 42 నగరాల్లో హైదరాబాద్ మహానగరం కూడా ఉంది.

హైదరాబాద్ లోని 25 గృహ ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినట్లుగా గుర్తించారు. వీటి పనులు మధ్యలో ఆగిపోవటం ద్వారా వాటిని కొనుగోలు చేసిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాజెక్టు డెవలపర్ల ఆర్థిక నిర్వాహణ సరిగా లేకపోవటం.. ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు వారికి లేకపోవటమే ఈ దుస్థితికి కారణంగా చెప్పాలి. ఇలా ఆగిన ప్రాజెక్టుల్లో 1636 ప్రాజెక్టులు 14 టాప్ శ్రేణి నగరాలకు చెందిన వాటిల్లోనే ఉండటం గమనార్హం. 4.31 లక్షల ఇళ్లు లేదంటే ప్లాట్లు ఉన్నట్లుగా లెక్క కట్టారు.

మిగిలిన 345 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 76 వేలకు పైగా యూనిట్లు 28 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి. 2018లో 4.65 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోగా.. తాజాగా వీటి సంఖ్య 5.08 లక్షలకు పెరగటం విశేషం. ఈ సమస్యకు కారణం.. వినియోగదారుల నుంచి సేకరించిన డబ్బుల్ని అధిక లాభాల కోసం వేరే భూముల మీద కొనుగోలు చేసేందుకు మక్కువ చూపటం.. నిధుల్ని దారి మళ్లించటంతో పాటు.. తమకున్న రుణాల్ని చెల్లించే విషయంలో ప్రదర్శించే అశ్రద్ధ ప్రాజెక్టులు ఆగిపోవటానికి కారణాలుగా చెబుతున్నారు.

ఇళ్లను కొనుగోలు చేసే అంశంలో డెవలపర్ల సామర్థ్యాల్ని అంచనా వేయటం జాగ్రత్తగా ఉండాలి... సరైన నిర్ణయం తీసుకోవటం చాలా అవసరంగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే.. అత్యధికంగా ముంబయిలో ఉన్నాయి. ఈ మహానగరంలో మొత్తం234 ప్రాజెక్టులు ఆగిపోగా.. వీటి కారణంగా 37,883 ఇళ్లు.. ప్లాట్ల పనులు నిలిచాయి. రెండో స్థానంలో బెంగళూరు మహానగరం ఉంది. ఇక్కడ 225 ప్రాజెక్టులు.. 39,908 ఇళ్లు నిలిచాయి. మూడోస్థానంలో థానే (186), ఫుణె (172), నవీ ముంబయి (125), నొయిడా (103), చెన్నై (92), కోల్ కతా (82) ఉన్నాయి. హైదరాబాద్ లో మొత్తం 25 ప్రాజెక్టులు ఆగాయి. ఇక.. అతి తక్కువగా ప్రాజెక్టులు ఆగిన మహానగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు ఆగినట్లుగా నివేదిక పేర్కొంది. దీని కారణంగా 900 ఇళ్లు/ప్లాట్ల నిర్మాణం నిలిచింది. తర్వాతి స్థానంలో హైదరాబాద్.. మూడో స్థానంలో భోపాల్ (27 ప్రాజెక్టులు) నిలిచింది.