పోప్ ఫోటో విడుదల చేసిన వాటికన్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?
పోప్ ఫ్రాన్సిన్స్ కు చెందిన తాజా ఫోటోను వాటికన్ విడుదల చేసింది. ఆ సమయంలో ఆయన ఆస్పత్రిలో ఉన్నారు.
By: Tupaki Desk | 17 March 2025 1:45 PM ISTపోప్ ఫ్రాన్సిస్ (88) తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు రెండు ఊపిరితిత్తుల్లోనూ న్యుమోనియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో.. మూత్రపిండ వైఫల్య సమస్య కూడా గత నెల చివర్లో బయటపడింది. అయితే.. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు కథనాలొచ్చాయి.
ఇందులో భాగంగా... శ్వాస సంబంధిత తీవ్ర విపత్కర పరిస్థితులేవీ ఆయనకు ఎదురుకాలేదని.. మూత్రపిండ వైఫల్యం కూడా స్వల్పస్థాయిదేనని వాటికన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అనంతరం గత కొన్ని రోజులుగా పోప్ తన పనులు తానే చేసుకోవడం ప్రారంభించారని కథనాలొచ్చాయి. ఈ సమయంలో తాజాగా ఆయన ఫోటోను వాటికన్ విడుదల చేసింది.
అవును... పోప్ ఫ్రాన్సిన్స్ కు చెందిన తాజా ఫోటోను వాటికన్ విడుదల చేసింది. ఆ సమయంలో ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. వాస్తవానికి తీవ్రమైన శ్వాసకోస సమస్యతో ఫిబ్రవరి 14న రోమ్ లోని జెమెల్లి ఆస్పత్రిలో చేరారు పోప్.. అప్పటి నుంచి ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోటో విడుదలయ్యింది.
ఆస్పత్రిలో ఒక ప్రార్థనా మందిరాన్ని పోప్ కోసం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో బలిపీఠం ఎదురుగా పోప్ కూర్చున్నప్పుడు వెనుక నుంచి తీసిన ఫోటో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ముఖం మాత్రం ఫోటోలో స్పష్టంగా కనిపించలేదు. అయితే.. ఆయనకు ఆక్సిజన్ అందించడం, ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నట్లుగా ఎలాంటి వైద్య పరికరాలు కనిపించలేదు.
ఇదే సమయంలో... పోప్ హెల్త్ బులిటెన్ శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. పోప్ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఇదే సమయంలో.. ఆయన శ్వాస కూడా సులువుగా తీసుకుంటున్నారని, రాత్రి పూట మాత్రం యాంత్రిక వెంటిలేషన్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు.