Begin typing your search above and press return to search.

అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఇంకా పిల్లలను కనాల్సిన అవసరం ఉందా?

అయితే ప్రభుత్వం మాత్రం తన విధానాలను మార్చుకుంటోంది. పిల్లలను కనడంపై ఉన్న నియంత్రణను సడలిస్తోంది.

By:  Tupaki Desk   |   22 Dec 2024 9:30 PM GMT
అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో ఇంకా పిల్లలను కనాల్సిన అవసరం ఉందా?
X

ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం ప్రథమ స్థానానికి చేరుకుంది. కొన్ని దశాబ్దాలు రెండో స్థానంలో ఉన్న మనం గత ఏడాది చైనాను వెనక్కి నెట్టి 145 కోట్ల జనాభాతో తొలి స్థానాన్ని ఆక్రమించుకున్నాం. అయితే జనాభా ఈ స్థాయిలో పెరిగిన ఇప్పుడు దేశంలో జనాభా నియంత్రణపై ఉన్న నిబంధనలు ఎత్తేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పిల్లలను కనమంటూ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఒకప్పుడు ఇద్దరు ముద్దు.. అంతకు మించి వద్దే వద్దు అని చెప్పేవి ప్రభుత్వాలు. ఆ తర్వాత ఒక్కరు చాలు.. అంతకు మించి అసలు వద్దే వద్దు అనేవి. ప్రభుత్వం పిలుపునందుకుని ప్రజలు కూడా జనాభా నియంత్రణ చర్యలు బాగానే ఫాలో అయ్యారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన ఒకరిద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తన విధానాలను మార్చుకుంటోంది. పిల్లలను కనడంపై ఉన్న నియంత్రణను సడలిస్తోంది. జనాభాలో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్న మనం ఇప్పుడు ఇంకా పిల్లలను ఎందుకు కనాల్సివస్తుందనే ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

దేశంలో ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా నియంత్రణ వందశాతం అమలైంది. దీనివల్ల దక్షిణాదిలో జనాభా తక్కువవడంతో లోక్ సభ సీట్ల పెంపులో దక్షిణాదిలో సీట్లు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా తక్కువ సంతానోత్పత్తి రేటు జనాభాలో సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల భవిష్యత్లో ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉండటంతో జనాభా నియంత్రణపై ఆంక్షలను ఎత్తివేయాలని దక్షిణాది రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. అయితే ఏపీలో ఈ దిశగా తొలి అడుగు వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ ఉన్నవారు అనర్హులు అన్న నిబంధన తొలగించారు. దీంతో జనాభా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని వెల్లడైంది. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా జనాభా పెరగాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో సైతం జనాభా నియంత్రణ మార్గదర్శకాలను మార్చాలని చూస్తోంది.

మన దేశంలో సంతోనోత్పత్తి రేటు కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. 1950లో సగటున ఒక మహిళ 5 నుంచి ఆరుగురు పిల్లలను కంటే ఇప్పుడు కేవలం ఒక్కరితోనే సరిపుచ్చుకుంటున్నారు. 17 రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసిరే అవకాశం ఉంది. ప్రాన్స్ జనాభాలో వృద్ధుల సంఖ్య 7 శాతం నుంచి 14 శాతానికి పెరగడానికి 120 ఏళ్లు పడితే, స్వీడన్ లో ఇంతే స్థాయిలో రెట్టింపు కావడానికి 89 ఏళ్లు పట్టింది. అదే భారత్లో వృద్ధుల సంఖ్య పెరగడానికి 28 ఏళ్ల సమయమే అవుతుంది. దేశవ్యాప్తంగా చినన కుటుంబాలను ప్రోత్సహించిన కుటుంబ సంక్షేమ పథకాలతో ఈ మార్పు సాధ్యమైనా ఈ పరిణామం అనుకోని ఫలితాలకు దారితీస్తోంది. జనాభా తగ్గిపోవడం వల్ల తలసరి ఆదాయం ప్రభావితమవుతోంది.

పెరుగుతున్న వృద్ధుల సంఖ్య వల్ల భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ల పథకాన్ని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు, పరిమిత వనరులతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలకు భవిష్యత్తులో పెన్షన్లకే భారీ నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేకాకుండా శ్రామిక శక్తి తగ్గిపోయి తలసరి ఆదాయం పడిపోయే ప్రమాదం కూడా పొంచివుంది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తతో ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న అనుభవాలను పరిశీలించి మన దేశంలో జనాభా పెంచుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.