పోసానికి "11" కనెక్ట్... నెట్టింట ట్రోలింగ్ స్టార్ట్!
ఈ సమయంలో పోసాని తరుపున సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
By: Tupaki Desk | 28 Feb 2025 1:20 PM ISTసినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సమయంలో పోసాని తరుపున సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకూ ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా... బీ.ఎన్.ఎస్. చట్టం ప్రకారం పోసాని కృష్ణమురళికి 41ఏ నోటీసులు ఇచ్చి, బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు పొన్నవోలు. అయితే అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు.
దీంతో... మార్చి 12వ తేదీ వరకూ పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉండనున్నారు. ఈ సమయంలో.. ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోసానికి జైలు అధికారులు 2261 నెంబర్ కేటాయించారు. దీంతో... టీడీపీ అభిమానులు నెట్టింట సందడి మొదలుపెట్టారు! గతం గుర్తుచేసుకుని.. రెట్టింపు ట్రోలింగ్స్ చేస్తున్నారని అంటున్నారు.
అవును... 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... ఆ 23ని లింక్ చేస్తూ టీడీపీ నేతలపై వైసీపీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసేవారు. ఇందులో భాగంగా.. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా కేటాయించిన ఖైదీ నెంబర్ 7691 ని కలిపి ట్రోల్ చేసేవారు.
ఇందులో భాగంగా... 7+6+9+1 = 23 అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారని అంటారు! అప్పట్లో ఈ 23 నెంబర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారేది! కట్ చేస్తే... 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో.. రివేంజ్ తీర్చుకునే పనిలో తమ్ముళ్లు బిజీగా ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఆ 11 నెంబర్ తో కనెక్ట్ చేస్తూ వైసీపీ నేతలపై ట్రోల్స్ నెట్టింట దర్శనమిచ్చేవి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత పోసానికి జైల్లో రిమాండ్ ఖైదీ నెంబర్ 2261 కేటాయించడంతో... 2+2+6+1 = 11 అంటూ సోషల్ మీడియా వేదికగా మొదలుపెట్టేశారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ తమ్ముళ్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు!