చేసుకున్న వారికి చేసుకున్నంత 'రాజా'!
రాజా- అనే ఊతపదంతో తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేసే సినీ నటుడు, దర్శకుడు, ఇటీవలి వరకు వైసీపీ లో ఉన్న పోసాని కృష్ణ మురళి.. అరెస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
By: Tupaki Desk | 27 Feb 2025 3:50 AM GMTరాజా- అనే ఊతపదంతో తనదైన శైలిలో రాజకీయ విమర్శలు చేసే సినీ నటుడు, దర్శకుడు, ఇటీవలి వరకు వైసీపీ లో ఉన్న పోసాని కృష్ణ మురళి.. అరెస్టు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే.. ఆయనపై సానుభూతి ఎక్కడా కనిపించలే దు. నిమిషాల వ్యవధిలోనే పోసాని అరెస్టుకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాను భారీగా కుదిపేశాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``చేసుకున్న వారికి చేసుకున్నంత రాజా`` అని మెజారిటీ నెటిజన్లు స్పందించారు. మరికొందరు.. ``ఇప్పుడు అర్థమైందా? రాజా`` అంటూ. పోసాని ఊతపదంతోనే విమర్శలు గుప్పించారు.
ఇదీ.. రాజకీయ ప్రస్థానం!
ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైన పోసాని రాజకీయ జీవితం.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు వచ్చింది. అయితే.. అప్పటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత.. కాంగ్రెస్‌కు చేరువయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశీర్వాదంతో హైదరాబా ద్‌లో ఆస్తులు కూడగట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. వీటిపై ఎప్పుడూ ఆయన స్పందించలేదు. ఆ తర్వాత.. వైఎస్ మరణంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత.. జగన్ పార్టీ పెట్టిన రెండు మూడేళ్లకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనూ చిలకలూరిపేట టికెట్ ఆశించారు.
అయితే.. జగన్ పార్టీ అధికార ప్రతినిధిగా పోసానిని నియమించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాష్ట్రంలోని 12 నియోజక వర్గాల్లో పోసాని ప్రచారం చేశారు. అన్ని చోట్లా వైసీపీ నాయకులు విజయం దక్కించుకున్నారు.(ఇది పాదయాత్ర హవా అని గెలిచిన వారే చెప్పారు) అనంతరం.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీవీ, ఫిలిం కార్పొరేషన్ చైర్మన్‌గా పోసానిని నియమిస్తూ.. జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, అక్కడి నుంచి అధినేతను మచ్చిక చేసుకునేందుకు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాపులను తీవ్రంగా దూషించేవారు. అదేసమయంలో కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబుపై నా వ్యక్తిగత విమర్శలు చేశారు.
''కాపులు- కమ్మలకు ఊడిగం చేయాలా? ఇదేనా పవన్ చెబుతోంది!''- అంటూ.. కొన్ని సందర్భాల్లో పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యారు. కాపులను కమ్మల కాళ్ల దగ్గర పడేస్తున్నారు..మీరు తెలుసుకోవాలి.. అని కాపులను ఉద్దేశించి ప్రసంగించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఆయా పరిణామాలపై కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అయితే.. దీనికి ముందే.. పోసాని వైసీపీకి గుడ్ బైచెప్పారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. చేసిన పాపం మాత్రం వెంటాడిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.