వదలని కేసులు.. మళ్లీ పోలీసు కస్టడీకి పోసాని!
అనుచిత ప్రవర్తన ఆరోపణలపై అరెస్టు అయిన సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని కేసులు వదలడం లేదు.
By: Tupaki Desk | 18 March 2025 9:00 AM ISTఅనుచిత ప్రవర్తన ఆరోపణలపై అరెస్టు అయిన సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని కేసులు వదలడం లేదు. వరుస కేసులతో కారాగార వాసం చేస్తున్న పోసానికి బెయిల్ వచ్చిన జైలు జీవితం తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 17 కేసులు నమోదు అవడం, ఓ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పోలీసులు అరెస్టు చూపడంతో పోసాని ఇంకా జైలులోనే గడపాల్సివస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి సోమవారం మరో షాక్ తగిలింది. పెండింగులో ఉన్న బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సిన సమయంలో ఆయనను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసానికి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో పోసాని అరెస్టు అయ్యారు. ఒకే తరహా ఆరోపణలపై నమోదైన వివిధ కేసుల్లో ఆయన ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. తొలుత కడప, ఆ తర్వాత కర్నూలు, గుంటూరు, విజయవాడ జైలు యాత్ర చేసిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. రేపూ, మాపో ఆయనకు బెయిల్ వస్తుందని అనుకుంటుండగా, న్యాయస్థానం నుంచి మరో షాక్ తగిలింది. గుంటూరు సీఐడీ నమోదు చేసిన కేసులో పోసానికి ఓ రోజు పోలీసు కస్టడీ విధిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రధానమైన నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో వారం క్రితమే ఆయన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసు అనూహ్యంగా తెరపైకి వచ్చి పోసాని విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు అదే కేసులో ఆయనకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న పోసాని విడుదలకు సీఐడీ కేసు మాత్రమే అడ్డంకిగా చెబుతున్నారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగనుంది. ఇప్పటివరకు సీరియస్ కేసులుగా చెప్పుకుంటున్న నాలుగింట్లో ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో సీఐడీ కేసులోనూ మోక్షం లభిస్తుందని అంతా ఆశించారు. అయితే అనూహ్యంగా అదే కేసులో ఆయనకు పోలీసు కస్టడీ విధించారు. మంగళవారం ఒకవైపు పోలీసు విచారణ, మరోవైపు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక ఈ కేసుల పరంపరలో పోసానికి వ్యతిరేకంగా మరో ఫిర్యాదు కూడా సోమవారం వెలుగు చూసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తమను మోసం చేశాడని, రూ.9 లక్షలు వసూలు చేశాడని ఆరోపిస్తూ ఓ బాధితుడు సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసు కూడా పోసానిపై నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వరుస కేసులతో పోసానిని ఇప్పట్లో విడిచిపెట్టేలా లేరంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.