Begin typing your search above and press return to search.

అయ్యో.. పోసాని, ఇంకెన్నాళ్లో..!

గుంటూరులో కేసు విచారణ నిమిత్తం కర్నూలు నుంచి సీఐడీ పోలీసులు ఆయనను పీటీ వారెంటుపై తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బుధవారం రాత్రి జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు.

By:  Tupaki Desk   |   13 March 2025 10:18 AM IST
అయ్యో.. పోసాని, ఇంకెన్నాళ్లో..!
X

సినీనటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళిలో ధైర్యం సడలిపోయింది. నెల రోజులకు పైగా రాష్ట్రంలోని జైలు యాత్ర చేస్తున్న ఆయన బెదిరిపోయారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న తనను విడిచిపెట్టాలని, రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణయ్యమంటూ గుంటూరు కోర్టులో బోరున విలపించారు. అయినా, ఆయనకు మోక్షం లభించలేదు. నిబంధనల ప్రకారం సీఐడీ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసాని జైలు జీవితం కొనసాగించాల్సివచ్చింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించడంతోపాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచారని, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో సుమారు 4 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. మిగిలిన కేసుల్లో విచారణకు నోటీసులివ్వాలని హైకోర్టు సూచించడంతో పోసాని బుధవారం బెయిల్ పై బయటకు వస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసు పెండింగులో ఉండటం, ఆ కేసు కూడా బుధవారమే విచారణ జరగడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.

గుంటూరులో కేసు విచారణ నిమిత్తం కర్నూలు నుంచి సీఐడీ పోలీసులు ఆయనను పీటీ వారెంటుపై తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బుధవారం రాత్రి జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ విచారణ సందర్భంగా పోసాని కన్నీరు పెట్టుకున్నారని చెబుతున్నారు. 70 ఏళ్ల వయసున్న తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లు వాపోయారు. కక్ష ఉంటే కత్తితో నరికేయండని, కానీ ఇలా రాష్ట్రం మొత్తం తిప్పుతూ ఇబ్బంది పెట్టొద్దని పోసాని ప్రాధేయపడినట్లు చెబుతున్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, రెండు ఆపరేషన్లు జరిగాయని పోసాని న్యాయమూర్తికి చెప్పుకున్నారు. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బెయిల్ పై విడుదల అవ్వాల్సిన పోసాని మళ్లీ గుంటూరు జైలుకు వెళ్లాల్సివచ్చింది. మరోవైపు పోసానిపై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా బాపట్ల పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. కాగా, పోసానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. బెయిల్ పై పోసాని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని కోర్టుకు నివేదించారు.