Begin typing your search above and press return to search.

మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్..? మనసు మార్చుకున్న పోసాని

సినీనటుడు పోసాని క్రిష్ణమురళి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   29 March 2025 1:30 PM
మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్..? మనసు మార్చుకున్న పోసాని
X

అరెస్టుకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వివిధ కేసుల్లో అరెస్టు అయి 24 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నా కేసుల్లో సుదీర్ఘ సమయం విచారణ ఎదుర్కోవాల్సివున్నందున రాజకీయ అండ ఉండాలని భావిస్తున్న పోసాని వైసీపీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సినీనటుడు పోసాని క్రిష్ణమురళి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలో అరెస్టు కావడానికి కొద్ది రోజుల ముందు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు పోసాని ప్రకటించారు. వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే ఆందోళన, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబితే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తారనే ఆలోచనతోనే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పోసాని రాజకీయాలకు విరామం ప్రకటించినా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను తేలికగా విడిచిపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 17 కేసుల్లో వరుసగా అరెస్టు చేయించింది. ఈ కేసుల్లో బెయిల్ పై ఈజీగా బయటకు రాకుండా సీఐడీని రంగంలోకి దింపింది.

దీంతో సుమారు 24 రోజుల పాటు పోసాని జైలు జీవితం గడపాల్సివచ్చింది. ఇక బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. బెయిల్ ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటనలు చేయకుండా మౌనాన్ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం సుదీర్ఘ కాలంపాటు కోర్టులో పోరాడాల్సివున్నందున తనకు రాజకీయ అండ ఉండాలని పోసాని భావిస్తున్నారట. ఆరోగ్యం సరిగా లేకపోవడం, స్థానికంగా లేకపోవడం వల్ల కూడా పోసాని పునరాలోచనకు కారణంగా చెబుతున్నారు. తాను ఒంటరిగా ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సివస్తుందన్న భావనతో తిరిగి వైసీపీలో మునుపటిలా యాక్టివ్ గా ఉండాలని పోసాని భావిస్తున్నారట. దీనిపై తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.