పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సునామీ... దేనికీ సునామీ..?
కనీవినీ ఎరుగని రీతిలో లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్నారనే విషయం ఇప్పుడు దేశచరిత్రలో పెను సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 7 May 2024 5:27 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలింగ్ తేదీకి సమయం దగ్గరపడుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్నారనే విషయం ఇప్పుడు దేశచరిత్రలో పెను సంచలనంగా మారింది.
అవును... ఏపీలో రాబోయేది ఏ ప్రభుత్వం..? అధికార వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారా.. లేక, 2014 తరహాలో కూటమికి మరో అవకాశం ఇవ్వబోతున్నారా అనే విషయంపై ఏమాత్రం పూర్తిస్థాయి అంచనాకు రాలేకపోతున్నామనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు అఫ్లై చేయడం దేశ చరిత్రలోనే పెను సంచలనం అని అంటున్నారు!
ఇదే సమయంలో... తాజాగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పెను సంచలనాలను నమోదు చేస్తుందనే చెప్పాల్సి వస్తోంది! దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 100% పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కు పరుగులు పెడుతోందని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ లు చాలక పలుచోట్ల పోలింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొందంటూ వస్తున్న కథనాలు ఈ వైరల్ ఇష్యూని నొక్కి చెబుతుంది!
ఉదాహరణకు... తాడికొండ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు అన్నస్థాయిలో లాం - ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉపాధ్యాయులు భారీ ఎత్తున చేరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మంగళవారం ఉదయాన్నే మాచర్ల, గురజాల, దాచేపల్లి, వినుకొండ, పెదకూరపాడు సుదూర ప్రాంతాలకు పయనమైన వారు స్త్రీ, పురుష వయోభేదం లేకుండా ఓటుకు పోటెత్తిన తీరు ఆసక్తిగా మారిందని చెబుతున్నారు!
ఇదే క్రమంలో... పెదకూరపాడు ఫెసిలిటేషన్ సెంటర్ లో తోపాటు గుంటూరు, నర్సరావుపేట, సత్తెనపల్లి, తాడేపల్లి, తాడికొండ, అమరావతి ప్రాంతాల్లో మిస్ కాకుండా ఓటింగ్ కు రావడం.. జాబితాలో పేరు మిస్ అయ్యింది అంటే అర్దరాత్రి అయినా ఓటెయ్యనిదే కదలం అని పలువురు పట్టుదలగా నిలబడటం కనీవనీ ఎరుగని పెను సంచలనమనే చెప్పాలసిన పరిస్థితి!
ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పై తాజాగా నెలకొన్న అంచనాల ప్రకారం ఈ ఓట్ల సునామీ ఖచ్చితంగా 99% పోలింగ్ నమోదై తీరుతుంది అనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఓటింగ్ విషయంలోని ఈ మహాచైతన్యం ఏ ప్రస్థానానికి నాంది పలుకుతుందనేది తెలియాలంటే... జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే!