హైటెన్షన్: పోస్టల్ ఓట్ల లెక్కింపుతోనే రచ్చ షురూ..?
హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికలకు తగ్గట్లే.. పోలింగ్ రోజున.. పోలింగ్ తర్వాత ఏపీ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 31 May 2024 5:16 AM GMTహోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికలకు తగ్గట్లే.. పోలింగ్ రోజున.. పోలింగ్ తర్వాత ఏపీ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. సాధారణంగా పోలింగ్ వేళ చోటు చేసుకునే హింస ఆ తర్వాతి రోజుకు లేకుండా చేయటం కోసం అధికార యంత్రాగం బలంగా పని చేస్తుంది. అందుకు భిన్నంగా పోలింగ్ తర్వాత ఏపీలోని పలు ప్రాంతంలో చోటు హింసాత్మక పరిణామాల్ని చూసిన వారికి.. ఫలితాల వెల్లడి రోజున. రిజల్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేసిన రెండు మెమోలు వివాదాస్పదంగా మారాయి. వీటిని అధికార వైసీపీ తీవ్రంగా తప్పు పడుతోంది. దీనిపై ఇప్పటికే న్యాయపోరాటాన్ని షురూ చేశారు. ఇక్కడే పలు వాదనలు వినిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోల్ కావటంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరించిన తీరే కారణమంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్లలో తమకు దెబ్బ పడేలా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. అందుకు గండి కొట్టేలా న్యాయపరమైన అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ.. పోస్టల్ బ్యాలెట్లలో చేతి రాతతో తమ పేరు.. హోదా వివరాల్ని పేర్కొనని ఓట్లను చెల్లకుండా చూడాలన్నది వైసీపీ వాదన. అయితే.. ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీన్ని వైసీపీ తప్పు పడుతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు వైసీపీ వాదనల్ని వినటం తెలిసిందే.ఈ అంశంపై ఏపీ హైకోర్టు కౌంటింగ్ ముందు నాటికి క్లారిటీ ఇవ్వకుంటే.. పోస్టల్ ఓట్ల అంశం రచ్చగా మారుతుందని.. అదే జరిగితే.. ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి కౌంటింగ్ వేళ.. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని.. అందుకు చెక్ చెప్పేందుకు ఎన్నికల సంఘం ఏం చేయనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పోస్టల్ ఓట్లలో అత్యధికం అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఒకవేళ.. అదే జరిగితే మాత్రం పోస్టల్ ఓట్ల గుర్తింపుపై రచ్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. అదే జరిగితే.. హైటెన్షన్ వాతావరణం కౌంటింగ్ వేళ చోటు చేసుకునే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పకతప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.