Begin typing your search above and press return to search.

పోస్టల్ బ్యాలెట్ కొంప ముంచే సీట్లు అవేనా ?

ఏపీలో ఇపుడు పోస్టల్ బ్యాలెట్ మీద అతి పెద్ద యుద్ధం సాగుతోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 8:30 AM GMT
పోస్టల్ బ్యాలెట్ కొంప ముంచే సీట్లు అవేనా ?
X

ఏపీలో ఇపుడు పోస్టల్ బ్యాలెట్ మీద అతి పెద్ద యుద్ధం సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొన్ని నిబంధలను సవరించడం పట్ల వైసీపీ కోర్టుకు వెళ్ళింది. పోస్టల్ బ్యాలెట్ లో అవకతవకలకు ఇది కారణం అవుతుందని వాదిస్తోంది. దేశంలో అన్ని చోట్లా ఎలా ఉందో ఏపీలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఆమోదానికి అలాంటి నిబంధనలు ఉండాలని కోరుతోంది.

అంతే తప్ప ఉద్యోగి హోదా అతని సంతకం ఇవేమీ లేకుండా సీల్ వంటివి లేకుండా ఆమోదిస్తే పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళం అవుతుందని వైసీపీ అంటోంది. వైసీపీ ఆందోళనకు కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ని వేసిన వారిలో నూటికి తొంబై శాతం పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు. అలాగే ఎన్నికలకు ముందు తమ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘమైన ఆందోళన చేసిన అంగన్ వాడీ వర్కర్స్ కి కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు.

వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అవి గంపగుత్తగా టీడీపీ కూటమికి పడి ఉంటాయని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే అదేమీ కాదని అందులో తమ వాటా కూడా ఎక్కువగానే ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే వారు ఎంత గట్టిగా చెబుతున్నా ఏదో తెలియని భయం అయితే ఆవహించి ఉంది అని అంటున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2019లో టీడీపీకి యాంటీగా పడ్డాయి. అపుడు వైసీపీ చాలా చోట్ల వాటిని అందుకుని ఘన విజయాలు నమోదు చేసుకుంది. ఇపుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడి ఉంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి. పైగా హోరా హోరీగా సాగిన పోరులో అతి తక్కువ మెజారిటీలు వచ్చే చోట పోస్టల్ బ్యాలెట్ లే కీలకం అవుతాయని అంటున్నారు.

కాస్తా వెనక్కి వెళ్ళి 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే కనుక కనీసంగా పదిహేను నియోజకవర్గాల్లో ఇలా అతి తక్కువ ఓట్లతో విజేతలు బయటపడడం జరిగింది. విజయవాడ సెంట్రల్ లో చూసుకుంటే కేవలం పాతిక ఓట్లతో టీడీపీ మీద మల్లాది విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి అలాంటి భారీ పోరు జరిగిన సీట్లు అయితే ఏపీలో పదిహేను నుంచి పాతిక దాకా ఉండవచ్చు అని అంటున్నారు.

ఈ సీట్లలో అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యధి ముందు ఉన్నా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జత కూడితే అక్కడ కూటమికే మేలు జరిగే వీలు ఉంటుంది అన్న చర్చ మొదలైంది. అంతే కాదు పోస్టల్ బ్యాలెట్ డిసైడ్ చేసే ఈ సీట్లతోనే ఎవరైనా అధికారం చేపట్టేది అని అంటున్నారు. ఈసారి అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని అంటున్నారు.

ఏపీలో ఏ ప్రభుత్వాన్ని అయినా మార్చే సత్తా తమకే ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తూంటారు. అది కూడా నిజమని గతంలో జరిగిన ఎన్నికలు నిరూపించాయి. పాతికేళ్ళుగా జరిగిన ఎన్నికలను తీసుకుంటే 1999లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ఉద్యోగులు 2004, 2009లలో వైఎస్సార్ వైపు మొగ్గారు. తిరిగి 2014లో టీడీపీకి జై కొట్టారు. 2019లో వైసీపీకి టర్న్ అయ్యారు. 2024లో వారు టీడీపీ వైపే ఉన్నారని అంటున్నారు. గత సంప్రదాయాలను ట్రెండ్స్ ని తీసుకుంటే ఈసారి ప్రభుత్వాన్ని మార్చే స్థితిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే వీటిలో కూడా సరైన విధానం లేకుండా లెక్కిస్తే ఇబ్బందులు అన్నదే వైసీపీ వాదనగా ఉంది. ఏది ఏమైనా కూడా ఈసారి ఏపీలో అధికార మార్పు వెనక గేం చేంజర్ గా పోస్టల్ బ్యాలెట్ నిలుస్తుందా అన్నది పోస్ట్ పోల్ అంచనాలను బట్టి చూస్తే అర్ధం అవుతోంది అని అంటున్నారు.