Begin typing your search above and press return to search.

కూటమికి భారీగా పోలైన పోస్టల్ ఓట్లు... ఎన్నంటే...?

25 లోక్ సభ స్థానాల వారీగా పోలైన పోస్టల్ ఓట్లలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి అత్యధికంగా 57.10% ఓట్లు పోలవ్వగా... వైసీపీకి 28.11% ఓట్లు మాత్రమే దక్కాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 7:45 AM GMT
కూటమికి భారీగా పోలైన పోస్టల్  ఓట్లు... ఎన్నంటే...?
X

ఏపీలో ఎన్నికలు సమీపించినప్పటినుంచీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఆసక్తికరమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పోస్టల్ ఓట్లు అత్యధికంగా కూటమికే పడతాయని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రాభవం పోస్టల్ బ్యాలెట్ నుంచే మొదలవుతుందని.. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్ వాడీ టీచర్లు ఈ పోస్టల్ బ్యాలెట్ అత్యధికంగా కూటమి వైపు ఉండేలా చేస్తారనే చర్చ జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఘణాంకాలు ఆ విషయం నిజమనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్ సభ స్థానాల వారీగా పోలైన పోస్టల్ ఓట్లలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికి అత్యధికంగా 57.10% ఓట్లు పోలవ్వగా... వైసీపీకి 28.11% ఓట్లు మాత్రమే దక్కాయి. ఇదే క్రమంలో ఇండియా కూటమికి 6.05శాతం దక్కడం గమనార్హం.

అంటే... టీడీపీ కూటమికి, వైసీపీకి మధ్య పోస్టల్ ఓట్ల వ్యత్యాసం సుమారు 28.99 శాతమన్నమాట. ఇక ఓట్ల విషయానికొస్తే... మొత్తం పోలైన పోస్టల్ ఓట్లు 5,24,512 కాగా.. వాటిలో టీడీపీ & కో కి 2,86,706 ఓట్లు పోలవ్వగా.. వైసీపీకి 1,41,165 ఓట్లు వచ్చాయి. ఇదే క్రమంలో ఇండియా కూటమికి 30,386 ఓట్లు పడ్డాయి. మిగిలినవి ఇతరులకు దక్కాయి.

ఇదే క్రమంలో ఏ జిల్లాలో అత్యధికం, ఏ జిల్లాలో అత్యల్పం అనే విషయానికొస్తే... ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా కూటమికి 73.32% పోస్టల్ ఓట్లు పోలవ్వగా... ఆ తర్వాత విశాఖ జిల్లాలో 66.03%, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 65.87, కోనసీమ జిల్లా అమలాపురంలో 63.80%, నెల్లూరులో 63.72% ఓట్లు కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు.

ఇదే క్రమంలో అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప లోక్ సభ స్థానంలో కూటమికి 43.18 ఓట్లు పడ్డాయి. అనంతరం అరకులో 43.44%, తిరుపతిలో 47.97% ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. ఇక వైసీపీ విషయానికొస్తే అత్యధికంగా ఒంగోలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 36.33% ఓట్లు వారికి పోలవ్వగా... విజయవాడలో 36.22%, ఏలూరులో 34.13%, నరసరావుపేటలో 33.99% పోస్టల్ ఓట్లు ఆ పార్టీ అభ్యర్థులకు దక్కాయి.