Begin typing your search above and press return to search.

121 సంవత్సరాలకు గమ్యం చేరుకున్న పోస్ట్ కార్డ్.. వెనుక రహస్యం ఇదే..

కానీ ఒకప్పుడు.. అదే ఈ సెల్ ఫోన్స్ లేని కాలంలో ఉత్తరాలు, పోస్ట్ కార్డ్స్ మనుషుల మధ్య సమాచారాన్ని మోసుకు వెళ్తూ ఉండేది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 9:30 PM GMT
121 సంవత్సరాలకు గమ్యం చేరుకున్న పోస్ట్ కార్డ్.. వెనుక రహస్యం ఇదే..
X

ఇప్పటి తరం వారికి ఉత్తరాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు.. అదే ఈ సెల్ ఫోన్స్ లేని కాలంలో ఉత్తరాలు, పోస్ట్ కార్డ్స్ మనుషుల మధ్య సమాచారాన్ని మోసుకు వెళ్తూ ఉండేది. ఎవరికైనా ఉత్తరం వచ్చింది అంటే అది ఎన్నో జ్ఞాపకాలను మోసుకు వచ్చేది. అప్పట్లో తమకు వచ్చే ఉత్తరాల కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూసేవారు. అయితే ఒక ఉత్తరం పోస్ట్ చేసిన 121 సంవత్సరాల తరువాత చేరవలసిన చోటుకు చేరుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్న యదార్థంగా జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నేను ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు అన్నట్టుగా.. ఎప్పుడో రావలసిన ఉత్తరం ఎప్పటికో చేరుకుంది.. కానీ అది అలా రావడం వల్ల ఓ మంచి పనే జరిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా.. బ్రిటన్ లో ఎప్పుడో 120 ఒక్క సంవత్సరాల క్రితం పోస్ట్ చేసిన ఒక పోస్ట్ కార్డ్ ఇప్పుడు రెండు విడిపోయిన కుటుంబాలను కలిపింది.

1903 లో ఎవార్ట్ అనే ఒక అబ్బాయి తన సోదరి లిడియాకు ఓ పోస్టు కార్డును పంపించాడు. అది ఇప్పుడు స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ క్రాడాక్ స్ట్రీట్ బ్రాంచ్ కు చేరుకోవడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచురించారు. అలా వైరల్ అయిన ఈ లెటర్ ని చూసి రెండు కుటుంబాలు కలిసాయి. కార్డు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎవార్ట,లిడియాల మనవడు నిక్ డేవిస్, మనవరాళ్లు హెలెన్ రాబర్ట్, మార్గరెట్ స్పూనర్ గత నెలలో స్వాన్సీలోని వెస్ట్ గ్లామోర్గాన్ ఆర్కయివ్స్ లో కలుసుకున్నారు.

121 సంవత్సరాల క్రితం.. అంటే ఆ ఉత్తరం పంపిన సమయంలో ఎవార్ట్, లిడియా కుటుంబం స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో ఉండేవారు. సెలవల్లో ఫిష్ గార్డ్ లోని తన తాత ఇంటికి వెళ్లిన ఎవార్ట్, తన అక్కకు పోస్ట్ కార్డు కలెక్షన్ అంటే ఇష్టం అనే ఉద్దేశంతో అప్పట్లో ఈ కార్డును పంపించాడు. అప్పుడు పంపిన కార్డు కారణంగా ఇప్పుడు దూరమైన బంధుత్వాలు కలిసాయి. కార్డు పంపినవారు.. అందుకోవలసిన వారు ఇద్దరూ లేకపోయినా వారిని గుర్తుచేసుకొని కుటుంబాలు ఒకటి అవ్వడం అందరికీ ఆనందకరంగా ఉంది.