రేటెంత రెడ్డి... ఫోన్ ఫే పోస్టర్లు వైరల్!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Oct 2023 1:49 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార బీఆరెస్స్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. ఇదే సమయంలో నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించడంతోపాటు... తాజాగా మేనిఫెస్టోను కూడా విడుదల చేసేసింది. ఇదే సమయంలో ఈ రోజు హుస్నాబాద్ బహిరంగ సభలో శంఖారావం పూరించబోతోంది.
ఇదే సమయంలో 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ కూడా తన తొలి జాబితాను తాజాగా విడుదల చేసింది. మరో నాలుగైదు రోజుల్లో మిగిలిన జాబితా కూడా విడుదలవుతుందని అంటున్నారు. దీంతో... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం.. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో... ఈసారి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, తద్వారా జాతీయ స్థాయిలోనూ చక్రాలు తిప్పాలని కేసీఆర్ తీవ్రంగా పథకాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా హుస్నాబాద్ లో ఈ రోజు తొలి బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో... అటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సమరానికి రెడీ అవుతున్నారు.
అటు మోడీ, అమిత్ షా లతో వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు పెట్టించాలని తెలంగాణ బీజేపీ నేతలు పథకాలు రచిస్తుండగా... రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంకా గాంధీలతో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారంట తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సమయంలో "రేటెంత రెడ్డి" అంటూ కొన్ని పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి.
అవును... తెలంగాణలో ముడుపులు తీసుకుని టికెట్లను కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే డిజైన్ లో ఉన్న ఈ పోస్టర్లలో "రిసీవ్డ్ ఫ్రం 58 మేంబర్స్ - 580 కోట్లు... ప్రోసెసింగ్ ఫ్రం 61 మెంబర్స్ 610 కోట్లు" అని ముద్రించబడి ఉంది! ఈ ఫోన్ పే నెంబర్ "రేటెంత రెడ్డి" అనే పేరుమీద ఉండటం గమనార్హం.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.