అగ్గిపెట్టె హరీశ్.. రవ్వంత రేవంత్.. పేర్లు.. పోస్టర్ సెటైర్లు
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరహాలో ‘వాడు- వీడు’ అంటూ సహచర రాజకీయ నాయకులను దూషించే తీరు తెలంగాణ రాజకీయాల్లో లేదు.
By: Tupaki Desk | 17 Aug 2024 10:09 AM GMTపొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరహాలో ‘వాడు- వీడు’ అంటూ సహచర రాజకీయ నాయకులను దూషించే తీరు తెలంగాణ రాజకీయాల్లో లేదు. ఆ మధ్యలో కాస్తంత వేడెక్కినా తర్వాత ఎవరికి వారు వెనక్కుతగ్గారు. అయితే, రుణ మాఫీ పుణ్యమాని ఇప్పుడు సవాల్-ప్రతి సవాల్ రాజకీయం నడుస్తోంది. రైతు రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్.. మూడు విడతల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీని చేసేశామని అధికార కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతోంది. అయితే, దీనికిముందు ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కనుక అలా చేస్తే తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు.
ఆగస్టు 15 దాటింది.. మాఫీ పూర్తయింది..
మొన్నటి 15వ తేదీన సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా వైరా సభలో మూడో విడత మాఫీని ప్రకటించారు. దీంతోనే ప్రక్రియ మొత్తం పూర్తయిందని చెప్పారు. అంతేగాక.. హరీశ్ రాజీనామా చెయ్ అని డిమాండ్ చేశారు. లేదా ఏట్లో దూకు అంటూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. దీంతో హరీశ్.. మీ రాజీనామా ఎప్పుడంటూ పోస్టర్లు వెలిశాయి. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అభిమానుల పేరిట ఈ పోస్టర్లు వేశారు. హైదరాబాద్ బేగంపేట, రూసూల్ పుర బస్టాప్, ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్లలో పోస్టర్లు కలకలం రేపాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నందని, దమ్ముంటే హరీశ్ రావు తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని సవాల్ చేస్తూ పోస్టర్లలో రాశారు. అయితే, ఇందులో హరీశ్ ను ఉద్దేశించి రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా యాడబోయే అగ్గిపెట్టె హరీశ్ రావ్? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మలి దశ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం కాగా ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అప్పుడు సిద్దిపేటలో హరీశ్ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. దీనిని విమర్శకులు ప్రస్తావిస్తూ..పెట్రోల్ దొరికిన హరీశ్ రావు అర్దరూపాయి అగ్గిపెట్టె దొరకలేదు అని ఎద్దేశా చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్న శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని దీనికి సందర్భోచితంగా ప్రస్తావిస్తున్నాయి. అందుకనే ‘‘అగ్గిపెట్టె హరీశ్ రావు’’ అని సంబోధిస్తున్నాయి
రవ్వంత రేవంత్ అంటూ..
ఇక బీఆర్ఎస్ నాయకులు రుణ మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారంటూ భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. మాఫీ అరకొరగానే చేశారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తెరపైకి తెస్తున్నారు. రూ.40 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్.. ఇప్పుడు ఆ మొత్తాన్ని సగానికిపై కుదించారంటూ ధ్వజమెత్తుతున్నారు. మాఫీ చేసింది రూ.17 వేల కోట్లు మాత్రమేనంటూ ఆరోపిస్తున్నారు. దీనినే చేసింది రవ్వంత.. చెప్పుకొనేది కొండత అంటూ హైదరాబాద్ సహా పలుచోట్ల పోస్టర్లు ఏర్పాటు చేశారు. పదునైన విమర్శలు, సబ్జెక్ట్, గణాంకాలు, సామెతలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే రేవంత్ ను టీడీపీలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ లు రవ్వంత రెడ్డి అని విమర్శించేవి. రేవంత్ పర్సనాలిటీ పరంగా కూడా కాస్త చిన్నగా కనిపించేవారు కావడంతో రవ్వంత అని ఎద్దేవా చేశారు. రేవంత్ పేరు ప్రస్తావించకున్నా..ఇప్పుడదే పదాన్ని పోస్టర్లకు ఎక్కించి విమర్శిస్తున్నారు.