Begin typing your search above and press return to search.

షర్మిలకు పదవి... ఏపీ కాంగ్రెస్ నేతలు ఓకేనా...!?

ఇదిలా ఉంటే కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా కూడా అంత సులువుగా ఆ పదవిలోకి రాలేరు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 3:30 AM GMT
షర్మిలకు పదవి... ఏపీ కాంగ్రెస్ నేతలు ఓకేనా...!?
X

వైఎస్ షర్మిలకు ఏ అర్హత ఉందని పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు అన్న ప్రశ్న రావచ్చు. నిజానికి చూస్తే ఏపీలో కాంగ్రెస్ లేకపోవచ్చు. కానీ జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఉంది. పీసీసీ చీఫ్ ఒకనాడు మోజున్న క్రేజున్న పదవి. ఈ పదవి కోసం ఎంతటి ప్రయత్నాలు జరిగేవో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రకారం ఎవరైనా కూడా అంత సులువుగా ఆ పదవిలోకి రాలేరు.

పార్టీలో చేరిన వెంటనే ఆ పదవి దక్కదు. కానీ షర్మిల ఇలా చేరగానే అలా పీసీసీ చీఫ్ ఇచారు. ఇంతకీ షర్మిలకు ఈ పదవిని స్వీకరించడానికి గల క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే జవాబు కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి అని అంటున్నారు.

షర్మిల అంటే కేరాఫ్ వైఎస్సార్. వైఎస్సార్ తనయగానే ఆమెకు ఈ పదవి అని అంటున్నారు. ఇక ఆమె మూడేళ్ళ క్రితం తెలంగాణాలో పార్టీ పెట్టి తిరిగినా ఉపయోగం లేకపోయింది. ఆమె అక్కడ చాప చుట్టేసి ఏపీకి వస్తున్నారు. ఆమె పార్టీ పెట్టింది కాంగ్రెస్ ని ఆకట్టుకోవడానికా అన్న డౌట్లూ ఇపుడు వస్తున్నాయని అంటున్నారు.

ఇక ఆమె తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం తన సీటుని తాను గెలుచుకోలేదు. ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె నిలబడలేదు. అయినా ఆమె వైఎస్సార్ వారసురాలిగా జనంలో పెట్టి రాజకీయ లబ్దిని పొందాలని కాంగ్రెస్ చూస్తోంది అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ వైఖరి కూడా బహు చిత్రం అని అంటున్నారు

ఆనాడు వైఎస్సార్ సీఎం గా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు అయితే ఆయన కుమారుడు అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు, ప్రత్యక్ష ఎన్నికలో పాల్గొని ప్రజల చేత గెలుపు ముద్ర వేసుకున్నారు. అయినా సరే ఆయనకు పీసీసీ చీఫ్ కానీ ఏ ఇతర పదవి కానీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆనాడు అంగీకరించలేదు ఇపుడు మాత్రం షర్మిలకు నేరుగా పీసీసీ చీఫ్ ఇస్తున్నారు అంటే అన్నకు ఎదురుగా చెల్లెలిని పెట్టి రాజకీయ యుద్ధం నడపడం అన్న కుటిల రాజనీతి కనిపిస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు వైఎస్సార్ రాజకీయ వారసత్వం తమకు దక్కాలని కాంగ్రెస్ కోరిక కూడా ఇందులో కనిపిస్తోంది అంటున్నారు. ఇక వైఎస్సార్ రాజకీయ వారసత్వం ఎవరిది అన్నది ఇప్పటికే ప్రజలు నిర్ణయించి జగన్ కి ఓటేశారు. ఇపుడు ఆయన కుమార్తె వచ్చినా ఆ వైపు టర్న్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అంతా వెళ్ళిపోగా కొందరు మిగిలారు. వారు రాజకీయంగా సీనియర్ నేతలు, అనేక సార్లు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. కొందరు అయితే కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా రాజకీయ అనుభవంలో షర్మిల కంటే అనేక రెట్లు సీనియర్లు ఏపీ కాంగ్రెస్ లో మిగిలిన నేతలు ఉన్నారు.

వారంతా షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి పట్ల ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. షర్మిలకు పీసీసీ పీఠం అప్పగించినా ఆమెకు అంటూ ఏపీలో వర్గం ఏదీ లేదు. ఆమెకు ఏపీ కాంగ్రెస్ తో ఏనాడు ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆమె అందరినీ కలిపి పనిచేయించాల్సి ఉంది. అంతే కాదు కరెక్ట్ గా ఎన్నికల వేళ ఆమెకు ఈ పదవి దక్కింది.

ఒక వైపు హై కమాండ్ ఆధిపత్యం డైరెక్షన్లు ఉంటాయి. మరో వైపు పేరుకు పదవి కానీ హై కమాండ్ ముద్ర ప్రతీ దాంట్లో ఉంటుంది. కాంగ్రెస్ రాజకీయాల్లో ఎంతో కాలం పనిచేసిన వైఎస్సార్ లాంటి వారే ఆ పార్టీలో ఆటుపోట్లకు విసిగిపోయిన సందర్భాలు ఉన్నాయని అంటారు. అలాంటిది ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ స్థాయిలో నడిపే నేర్పూ ఓర్పూ షర్మిలకు ఎంతవరకూ ఉన్నాయన్నది కూడా చూడాల్సి ఉంది.

కాంగ్రెస్ హై కమాండ్ డైరెక్షన్ లో సీనియర్ నేతల పర్యవేక్షణలో షర్మీల ఏపీ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానం సాగనుంది. మొత్తం మీద చూస్తే కనుక ఆమె అసలైన నాయకత్వ పటిమ ఏమిటి అన్నది ఈ పదవితో తేలనుంది అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా వైఎస్సార్ లెగసీని షర్మిల ద్వారా ఎంతవరకూ అందుకోగలదో కూడా ఈ ఎన్నికలలో తేలనుంది అంటున్నారు.