'పొత్తు ధర్మం' ఇదేనా పవన్ సర్: పోతిన ఫైర్
తాజాగా రాజీనామా చేసిన.. విజయవాడ వెస్ట్ నేత పోతిన మహేష్ తీవ్రస్తాయిలో నిప్పులు చెరిగారు. 'పొత్తు ధర్మం' అంటే ఇదేనా? అని నిలదీశారు.
By: Tupaki Desk | 8 April 2024 8:45 AM GMTజనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆ పార్టీ నాయకుడు.. తాజాగా రాజీనామా చేసిన.. విజయవాడ వెస్ట్ నేత పోతిన మహేష్ తీవ్రస్తాయిలో నిప్పులు చెరిగారు. 'పొత్తు ధర్మం' అంటే ఇదేనా? అని నిలదీశారు. పొత్తులు కుదిర్చిన పార్టీగా.. ఎక్కువ స్థానాలు తీసుకోవాల్సింది పోయి.. తీసుకున్న స్థానాలను కూడా తగ్గించుకుని పార్టీని నమ్ముకున్న వారి గొంతు కోస్తారా? అని ప్రశ్నించారు. పైగా తీసుకున్న స్థానాల్లో నూ ఇతర పార్టీల నుంచి తీసుకున్న నాయకులకు టికెట్ ఇవ్వడం ఏమేరకు న్యాయం? ధర్మం? అని ప్రశ్నించారు.
విజయవాడ పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారని చెప్పిన పోతిన.. మైనస్‌లో ఉన్న తెనాలిని తీసుకుని, ప్లస్‌లో ఉన్న వెస్ట్ సీటును ఎందుకు వదులుకున్నారని వ్యాఖ్యానించారు. త్యాగాలు కేవలం తమ లాంటి పార్టీని నమ్ముకున్నవారే చేయాలా? అని పోతిన నిప్పులు చెరిగారు. కమ్మలు త్యాగా నికి పనికిరారా? అని ప్రశ్నించారు. తెనాలిలో , మంగళగిరిలో కమ్మ సామాజకి వర్గం త్యాగాలు చేయడానికి పనికిరాదా? అని నిలదీశారు. విజయవాడ వెస్ట్ సీటును బలహీన వర్గాలకు కేటాయించి ఉంటే.. బాగుండే దని అన్నారు.
కానీ, వెస్ట్ సీటును పవన్ మాతృమూర్తిని దారుణంగా దూషించిన వ్యక్తికి టికెట్ ఇస్తే.. ఎలా సహకరించారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవనే చెప్పారని అన్నారు. త్యాగాలకు బీసీలు కావాలి.. టికెట్లకు కమ్మలు కావాలా? అని పోతిన ప్రశ్నించారు. తెనాలిలో కానీ, విజయవాడలో కానీ.. కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒక్క కాపు నాయకుడు కూడా మీకు కనిపించలేదా? అని పోతిన నిలదీశారు. వెస్ట్‌తో సంబంధం లేని కమ్మ వర్గానికి టికెట్ ఇస్తే.. బీసీలు త్యాగం చేయాలా? దీనిని పొత్తు ధర్మం అనాలా? అని పోతిన ప్రశ్నించారు.
పవన్ 'మ్యాచ్ ఫిక్సింగ్' చేసుకున్నారని పోతిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పార్టీని దాదాపు చేరువ చేశారని చెప్పారు. పార్టీ తీసుకున్న టికెట్లలో పది మందికి టీడీపీ నేతలకే ఇవ్వడం ఏంటని అన్నారు. పవన్ నిర్ణయాన్ని కాపు నాయకులు.. హర్షించడం లేదన్నారు. అనేక విమర్శలు కూడా వచ్చాయన్నారు. 24 స్థానాలు తీసుకోవడం.. పొత్తు ధర్మం కాదని కాపు నాయకులు.. బహిరంగంగానే విమర్శించారని తెలిపారు. కాపులు పార్టీకి దూరమయ్యారని, ఓటు కూడా బదిలీ కూడా కాదని చెప్పారు. కులాల మధ్య కుట్రకు పవన్ తెరదీశారని చెప్పారు.