నోరు మెదపని పవన్.. వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ?
టికెట్ ఇస్తామని చెప్పారు. నీకే ఇచ్చేస్తున్నామని వాగ్దానం చేశారు. ఇంకేముంది.. ప్రచారం చేసుకోమని కూడా హామీ ఇచ్చారు.
By: Tupaki Desk | 6 April 2024 7:37 AM GMTటికెట్ ఇస్తామని చెప్పారు. నీకే ఇచ్చేస్తున్నామని వాగ్దానం చేశారు. ఇంకేముంది.. ప్రచారం చేసుకోమని కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆ నేత చెలరేగిపోయారు. వైసీపీపై తీవ్రస్థాయిలో యుద్ధమే ప్రకటించారు. చివరకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా అసలు ఈ సీటునే బీజేపీకి కేటాయించేశారు. దీంతో తీవ్రంగా హర్టయిన.. సదరు జనసేనాని.. ఉద్యమాలు చేశారు. నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు. కానీ, పవన్ నుంచి పన్నెత్తు బుజ్జగింపు కూడా దక్కలేదు. దీంతో ఇప్పుడు వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.
అదే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఆయనే నగరాలు సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకుడు పోతిన మహేష్. ఈయన గత 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి.. 24 వేల ఓట్లు దక్కించుకున్నారు. అది అప్పట్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేసిన సమయంలోనే. ఇక, ఇప్పుడు ఈ మూడూ ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయన విజయంపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. నిత్యం మీడియాలోనే కాదు.. ప్రజల్లోనూ పోతిన ఉన్నారు.
దీంతో పశ్చిమ నియోజకవర్గంలో.. పోతిన గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే అంచనాలు వేసుకున్నా రు. దీనికి తోడు పవన్ కూడా.. షెడ్యూల్ కు ముందు వరకు ఈటికెట్ నీదే అని ఆశలు పెట్టారు. నేనున్నా ను.. నువ్వు రంగంలోకి దిగమన్నారు. దీంతో అప్పులు చేసి మరీ.. ప్రచారానికి కార్యకర్తలను సమాయత్తం చేసుకున్నారు. అయితే.. చివరాఖరుకు.. పవన్ చేతులు ఎత్తేశారు. ఇక్కడి సీటును బీజేపీ కి ఇచ్చేశారు. దీంతో పోతిన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. అయినా.. పవన్ నుంచి కనీసం బుజ్జగింపు కూడా దక్కలేదు.
దీంతో నిన్న మొన్నటి వరకు వేచి చూసిన పోతినకు జనసేన నుంచి ఎలాంటి సంకేతం రాకపోగా.. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నుంచి కూడా ఎలాంటిపలకరింపులు రాలేదని పోతిన వర్గం పేర్కొంది. ఈలోగా.. విపక్ష కూటమిలోనిఅసంతృప్తులపై కన్నేసిన వైసీపీ నాయకులు.. పోతిన వంటిబీసీలను ప్రభావితం చేయగల నాయకుడిని తీసుకుంటే బెటర్ అని ఆలోచన చేశారు. దీంతో ఆయనతో రహస్యంగా మంతనాలు జరుపుతూ వచ్చారు. ఇవి దాదాపు సక్సెస్ అయ్యాయని సమాచారం. నేడో రేపో.. సీఎం జగన్ సమక్షంలోనే పోతిన పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది.. కూటమి పార్టీలకు విజయవాడ వెస్ట్‌లో భారీ మైనస్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు.