సునీత - పద్మలు.. తొందర పడ్డారా.. !
వారే.. ఒకరు పోతుల సునీత, రెండోవారు వాసిరెడ్డి పద్మ. ఇద్దరూ కూడా గత ఐదేళ్లుగా వైసీపీలోనే ఉన్నారు.
By: Tupaki Desk | 25 Oct 2024 11:30 PM GMTరాజకీయాల్లో కొన్ని అనూహ్యంగా జరిగే పరిమాణాలు ఉంటాయి. మరికొన్ని చేజేతులా చేసుకునేవి కూడా ఉంటాయి. పైగా ప్రజల్లో అంతో ఇంతో ప్రభావం చూపే నాయకుల పరిస్థితి కొంత వరకు ఫర్వాలేదు. వారు ఏదో ఒక రకంగా నెట్టుకువస్తారు. కానీ, ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించలేని నాయకులు, నామినేటెడ్ పదవుల కోసం వెంపర్లాడే నాయకులు మాత్రం కొంత మేరకు జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఇద్దరు మహిళా నాయకులు తొందర పడ్డారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వారే.. ఒకరు పోతుల సునీత, రెండోవారు వాసిరెడ్డి పద్మ. ఇద్దరూ కూడా గత ఐదేళ్లుగా వైసీపీలోనే ఉన్నారు. పోతుల సునీత విషయాన్ని తీసుకుంటే.. ఆమె టీడీపీలోనే మొదట్లో రాజకీయాలు చేశారు. చీరాల నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు.
అయితే.. 2019లో ఆమె వైసీపీ పంచన చేశారు. అప్పట్లోనూ ఆమెకు ఎమ్మెల్సీనే కొనసాగించారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా పార్టీ మారారు. కానీ, ఎందుకో.. ఆమెకు ద్వారాలు ఇంకా తెరుచుకోలేదు.
ఇక, వాసిరెడ్డి పద్మ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీలోనే ఉన్నారు. పార్టీ తరఫున బలమైన గళమే వినిపించారు. అయితే.. ఇప్పుడు ఎందుకో.. జగన్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతూ.. పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. వీరిద్దరి విషయంలోనూ టీడీపీ చేర్చుకునే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పోతుల సునీత కు ఇప్పటికే టీడీపీ నో ఎంట్రీ బోర్డు పెట్టిందని అంటున్నారు. ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తున్నా.. ఇవి ఫలించేలా కనిపించడం లేదు.
మరోవైపు జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండానే వాసిరెడ్డి పద్మ కూడా తొందర పడ్డారన్నవాదన కూడా వినిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి వచ్చిన సూచనలు.. తద్వారా అందిన సమాచారం కారణంగా పోతుల, వాసిరెడ్డిలు రాజకీయాల్లో తొందర పడ్డారన్న చర్చ సాగుతోంది. మరోవైపు వీరిని చేర్చుకునేందుకు రెండు పార్టీల్లోనూ మహిళా నాయకులు ఇష్టపడడం లేదని కూడా సమాచారం. సో.. ఎలా చూసుకున్నా.. ఈ ఇద్దరు నాయకులు నడిరోడ్డుపై నిలబడ్డారన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.