సునీతకు ఎన్ని కష్టాలో.. తొందరపడి రాజీనామా..!
ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది.
By: Tupaki Desk | 18 Oct 2024 11:30 AM GMTఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు... పోతుల సునీత. నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
టీడీపీలో చాన్స్ వస్తుందన్న ఆశతో ఆమె అనూహ్యంగా చెప్పాచేయకుండానే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రి చెప్పారన్న కారణంగా ఆయన ఇచ్చిన హామీ మేరకు సునీత ఈ సాహసం చేశారు. రాజీనామా అయితే చేశారు. కానీ, టీడీపీనేతల అప్పాయింట్ మెంట్లే ఇప్పుడు దక్కడం లేదు. రెండు రోజుల కిందట సదరు మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేయగా.. తర్వాత కలుద్దామంటూ కబురు వచ్చింది.
దీంతో ప్రస్తుతం సునీత హైదరాబాద్‌కు మకాం మార్చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదన్న ఆవేదనో.. లేక, అధికార పార్టీలో ఉంటే మేలు జరుగుతున్న దూరదృష్టో మొత్తానికి సునీత అన్నీవదులుకుని టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆమెకు దారులు దాదాపు మూసుకు పోయాయి. పోయిన పదవి వచ్చే అవకాశం లేదు. వైసీపీ వెనక్కి పిలిచే చాన్స్ అంతకన్నాలేదు. మరోవై పు.. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
దీంతో సునీత కష్టాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె తొందరపడ్డారని ఎక్కువ మంది నాయ కులు చెబుతున్నారు. అయితే.. సంస్థాగతంగా పెద్దగా బలం లేని నాయకురాలు కావడంతో సునీతను ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్నా.. ఆమె స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీత చేరిక ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ చేర్చుకోవాలని పార్టీ అనుకున్నా.. మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.