నైట్ లవ్వర్ ని కలుసుకోవాలని పవర్ కట్... నిజం పెళ్లి చేసిన గ్రామస్తులు!
గ్రామం లో విద్యుత్ ను నిలిపివేసి.. చీకట్లో ప్రియుడిని కలవడం మొదలుపెట్టింది.
By: Tupaki Desk | 24 July 2023 2:07 PM GMTమనసుంటే మార్గం ఉంటుంది అని భావించిందో.. లేక, విద్యుత్ దీపాలు తమ ప్రేమ కు అడ్డుకాదని నిర్ణయించుకుందో తెలియదు కానీ... తన ప్రియుడిని కలుసుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఒక యువతి. తమ ప్రేమ వెలుగుల కోసం, తమ కలయికలోని మెరుపుల కోసం ఊర్లో కరెంట్ తీసేయడం మొదలుపెట్టింది.
అవును... వివరాళ్లోకి వెళ్తే... బిహార్ లోని పశ్చిమ చంపారన్ లో బెటియాకు చెందిన ప్రీతి కుమారి.. పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. ఈ సమయంలో వారు కలుసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉండేదంట. పగలు కలుసుకుంటే ఊరి జనం మొత్తం చూస్తారు.. రాత్రుళ్లు కలుసుకుందామంటే పట్టపగల్లా కరెంట్ దీపాలు వెలుతురు.
ఈ సమయంలో తమ ఏకాంతం కోసం ఆ యువతి ఒక పెద్ద ప్లానే వేసింది. తమ కలయికకు, తమ ఏకాంతానికి, తమ ప్రేమ కబుర్లకు విద్యుత్ ఆటంకంగా నిలుస్తుందని గ్రహించింది. గ్రామం లో విద్యుత్ ను నిలిపివేసి.. చీకట్లో ప్రియుడిని కలవడం మొదలుపెట్టింది.
ఇలా ప్రతీ రోజు వారిరువురూ అనుకున్న సమయానికి కరెంట్ ఆపేయడం మొదలుపెట్టింది. ఇలా తరచూ జరుగుతుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయం లో ఊరి లో దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. ఈ విషయంలో గ్రామస్తులంతా కలిసి కరెంట్ ఆఫీసు లో కంప్లైట్ కూడా చేశారు. అయినా నో యూజ్!
దీంతో అసలు ఏమి జరుగుతుంది.. రాత్రులు ప్రతీ రోజూ దాదాపు ఒకే సమయానికి కరెంట్ ఎందుకు పోతోంది తెలుసుకోవాలనుకున్నారు. దీంతో గ్రామస్థులే రంగం లోకి దిగారు. కాపలా లో భాగంగా నైట్ డ్యూటీలు చేయడం మొదలుపెట్టారు. పవర్ కట్ కాగానే కారణం ఏమిటో తెలుసుకోవాలని గ్రామం లో తిరిగారు.
ఈ సమయంలో కరెంట్ కట్ చేసి చీకట్లో ఏకంతంగా ఉన్న రాజ్ కుమార్ - ప్రీతి లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో కాస్త గట్టిగా ఆరాతీయగా... రాజ్ కుమార్ ను కలిసేందుకే విద్యుత్ నిలిపివేస్తున్నానని ప్రీతి చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. అనంతరం ఆ యువకుడి పై గ్రామం లోని కుర్రాళ్లు దాడికి దిగారు.
దీనికి ప్రతీకారంగా రాజ్ కుమార్ కూడా తన గ్రామం నుంచి గ్యాంగ్ ను పిలిపించాడు. దీంతో ఘర్షణ తీవ్రతరమైంది. రెండు వర్గాలూ ఫైట్ ని పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ సమయం లో దాడి నుంచి ప్రియుడ్ని కాపాడుకోవడం కోసం ప్రీతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ దాడి అనంతరం రెండు గ్రామాల మధ్య సుమారు వారంరోజుల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇలాంటి వాతావరణం ఇంకెంతకాలం అని ఆలోచించడం మొదలుపెట్టారు రెండు గ్రామాల పెద్దలు. ఈ సమయం లో ఇరువర్గాల పెద్దలూ కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం ఒక మాంచి ముహూర్తం చూసి ఇద్దరికీ పెళ్లి చేసేశారు. దీంతో ఈ కరెంట్ కట్ లవ్ కథ సుఖాంతమైంది.