Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్!?

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   8 Nov 2024 8:50 AM GMT
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్!?
X

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, పలువురు బిగ్ షాట్స్, అధికారులు ఇలా.. సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం వదలకుండా ట్యాపింగ్ చేశారు. ఆ ట్యాపింగ్ వల్ల ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. మరికొందరిని బెదిరించి.. భయపెట్టి.. బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఈ విషయం వెలుగుచూసింది. దాంతో వెంటనే విచారణ చేపట్టింది.

ఈ కేసులో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులను అందరినీ విచారించి.. పలువురిని జైలుకు సైతం తరలించారు. అయితే.. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావు మాత్రం ఈ కేసులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులకు చిక్కడం లేదు. కేసు విచారణలో పాల్గొంటే తన అరెస్ట్ తప్పదని అనుకున్నారో ఏమో కానీ.. నోటీసులు అందుకోకముందే ఆయన అమెరికాకు చెక్కేశాడు.

మార్చి 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అక్కడే ఉండిపోయారు. ఈ ఏడాది మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ విషయమై ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రావు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయాడు. నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేయగా.. ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా చేర్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

అయితే.. అప్పటి నుంచి ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు మెయిల్ ద్వారా నోటీసులు పంపించగా దానికి రిప్లై మాత్రం ఇచ్చారు. తాను వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వచ్చానని వెల్లడించాడు. తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన వీసా గడువు జూన్‌తో ముగుస్తుందని, వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని చెప్పారు. అయితే.. జూన్ ముగిసి నవంబర్ వచ్చినా ప్రభాకర్ ఇంకా ఇండియాకు రాలేదు. ఇంకా అక్కడే ఉండిపోయారు.

మూడు నెలల కాల పరిమితితో ఉన్న వీసాను.. మరో ఆరు నెలలపాటు పొడగించుకున్నారు. దాంతో పోలీసులు ఆ వెంటనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసించే ప్రయత్నమూ చేశారు. అంతేకాకుండా.. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును కూడ రద్దు చేశారు. ఇదే విషయాన్ని విదేశాంగ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేశారు. ఇంత జరుగుతున్న సందర్భంలో.. ఇప్పుడు ఈ కేసులో కీలక ట్విస్ట్ నెలకొన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ప్రభాకర్‌రావుకు ఆ దేశం గ్రీన్‌కార్డు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికాలోనే స్థిరపడిన కుటుంబసభ్యుల స్పాన్సర్‌షిప్‌తో పాటు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరు అయినట్లుగా సమాచారం. అయితే ఈ అంశంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ప్రభాకర్‌రావుకు కనుక గ్రీన్‌కార్డు మంజూరైతే ఈ ప్రభావం కేసు విచారణపై పడే ప్రమాదమూ లేకపోలేదు.

అమెరికా దేశం అతనికి గ్రీన్‌కార్డు మంజూరు చేస్తే ఆయన ఎన్ని రోజులైనా అమెరికాలో ఉండే వెసులుబాటు దొరుకుతుంది. ఒకవేళ అదే జరిగితే ఇక ఆయన హైదరాబాద్‌కు వస్తారన్న నమ్మకం కూడా లేదు. అదేక్రమంలో పాస్‌పోర్టు రద్దు అయిన విషయాన్ని భారత ఎంబసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ప్రయోజనం ఉండొచ్చన చర్చ జరుగుతున్నది.