తాతకు పైలెట్ మనమడి రిటర్న్ గిప్టు.. ఎమోషనల్ అవ్వాల్సిందే
తమిళనాడుకు చెందిన ప్రదీప్ క్రిష్ణన్ అనే పైలెట్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు.
By: Tupaki Desk | 6 April 2024 8:30 AM GMTచిన్న చిన్న విషయాలే కొన్నిసార్లు అమితమైన ఆనందాన్ని ఇస్తుంటాయి. మనకు సంబంధం లేని వారి సంగతైనా సరే.. వాటి గురించి విన్నప్పుడు.. చదివినప్పుడు మరింత సంతోషానికి గురవుతుంటాం. అలాంటి కోవకే చెందుతుంది ఈ ఉదంతం. చిన్నతనంలో తనను మోపెడ్ మీద వెనుక కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పిన తాతకు.. పెద్ద వయసులోకి అడుగుపెట్టిన తర్వాత.. ఆయనకు ఆ మనమడు అదిరే గిప్టు ఇవ్వటమే కాదు.. ఆయనకు బోలెడంత సంతోషాన్ని ఇచ్చిన వైనం చూసినప్పుడు ఆ మనమడ్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇంతకూ ఆ మనమడు ఎవరు? అతనేం చేశారన్న విషయంలోకి వెళితే..
తమిళనాడుకు చెందిన ప్రదీప్ క్రిష్ణన్ అనే పైలెట్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోను చూసిన వారంతా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళం.. ఇంగ్లిషులో మాట్లాడిన ఆ చిట్టి వీడియో ఎందరికో కొత్త ఉత్సాహాన్ని.. సరికొత్త స్పూర్తిని ఇస్తుందని చెప్పక తప్పదు. చెన్నై నుంచి కోయంబత్తూర్ కు వెళుతున్న ఇండిగో విమానంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వైరల్ గా మారింది. పైలట్ అయిన ప్రదీప్ క్రిష్ణన్.. విమానాన్ని నడిపే ముందు ప్రత్యేకమైన ప్రకటన అంటూ ప్రయాణికుల ముందుకు వచ్చారు.
సదరు ఫ్లైట్ లో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ప్రయాణిస్తున్నారని.. అందులో తన తాత తొలిసారి విమానం ఎక్కినట్లుగా పేర్కొన్నారు. తన తాత.. నానమ్మ.. అమ్మ ఈ విమానంలో 29వ వరుసలో కూర్చున్నారని.. తన తాత తొలిసారి విమానంలో ప్రరయాణిస్తున్నట్లుగా చెప్పిన అతను.. ‘‘నా చిన్నతనంలో మా తాత టీవీఎస్ 50 బండిపై వెనుక కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. తాతను విమానంలో తిప్పే అవకాశం వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన వేళ.. ప్రదీప్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.
అదే సమయంలో తన తాతను విమానంలోని ప్రయాణికులకు పరిచయం చేశారు. అందరూ తన తాతకు హాయ్ చెప్పాలని కోరారు. దీనికి విమానంలోని ప్రయాణికులు స్పందించారు. చప్పట్లతో తమ హాయ్ ను చెప్పారు. తన జీవితంలో ఇవి అద్భుత క్షణాలుగా ప్రదీప్ ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రయాణించటం ప్రతి పైలెట్ కు కలగా పేర్కొన్న ప్రదీప్ ఇన్ స్టా వీడియోకు బోలెడన్ని లైకులు.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. తన తాతకు ఇలాంటి రిటర్న్ గిప్టు ఇవ్వాలని ఏ మనమడు మాత్రం కోరుకోరు చెప్పండి?