వైరల్ టాపిక్... ఆ రోజు రాత్రి ప్రగతి భవన్ లో ఏమి జరిగింది?
ఇదే సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తి ప్రగతి భవన్ నుంచి రాత్రి సమయంలో నాలుగు కంపూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు చెబుతున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2024 8:09 AM GMTనాటి ప్రగతి భవన్, ప్రస్తుత ప్రజా భవన్ లో అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబరు మూడో తేదీ రాత్రి ఏమి జరిగింది అనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాశం అవుతుంది. ఆ రాత్రి ప్రగతి భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు భారీగా ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రాత్రే అవి బయటకు వెళ్లినట్లు తెలుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవి ఐటీ శాఖకు చెందిన కంప్యూటర్లు అనే చర్చ జరుగుతుండటం మరింత ఆసక్తిగా మారింది.
అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబరు 3వ తేదీన ప్రగతిభవన్ లో బీఆరెస్స్ నేతలు, అధికారులు హడావిడిగా ఉన్నా సంగతి తెలిసిందే. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడున్న లీడర్లు, అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు! అదే రోజు సాయంత్రం కేసీఆర్ తన సొంత కారులో ఫాం హౌజ్ కు వెళ్లారు. ఆ సమయలో అక్కడ పనిచేసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే భవన్ లో ఉన్నారు!
అప్పటికి రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక... ఎప్పటి మాదిరిగానే బయట ఇనుపకంచెలతోపాటు పోలీసు పహారా కట్టుదిట్టంగా ఉంది! అయితే ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత ఓ వ్యక్తి కారులో వచ్చి ప్రగతిభవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు కథనాలొస్తున్నాయి. వచ్చిన వ్యక్తి కొత్తవాడయ్యే ఛాన్స్ లేదని, అతడు రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి అయ్యుంటాడని, అందువల్లే ఎవరూ అభ్యంతర పెట్టి ఉండరని అంటున్నారు!
ఇదే సమయంలో ఆ అజ్ఞాత వ్యక్తి ప్రగతి భవన్ నుంచి రాత్రి సమయంలో నాలుగు కంపూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు చెబుతున్నారు. దీంతో... ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తిని గుర్తించి, నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం తాజాగా ఊపందుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదని తెలుస్తుంది!
వాస్తవానికి శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సీఎస్ శాంతి కుమారి సెక్రటేరియట్ కదలికలపై నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ఎవరూ చిన్న కాగీతం కూడా బయటికి తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెక్యూరిటీ స్టాఫ్ అందరినీ చెక్ చేసి పంపారు. అయితే ప్రగతిభవన్ కదలికలపై మాత్రం సీఎస్ దృష్టిపెట్టలేదని తెలుస్తుంది. అదే... ఎందుకు? అనే ప్రశ్నలూ దీంతో ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది!