Begin typing your search above and press return to search.

ప్రజ్ఞానంద ఫస్ట్ టైం క్లాసికల్ విక్టరీ... స్పెషల్ వీడియో వైరల్!

అయితే... వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మికి తాజాగా నార్వే చెస్ టోర్నమెంట్‌ లో ప్రతీకారం తీర్చుకున్నాడు ప్రజ్ఞానంద.

By:  Tupaki Desk   |   30 May 2024 5:15 AM GMT
ప్రజ్ఞానంద ఫస్ట్  టైం క్లాసికల్  విక్టరీ... స్పెషల్  వీడియో వైరల్!
X

ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా నార్వే చెస్ టోర్నమెంట్ లో పాల్గొన్న అతడు రికార్డ్ నెలకొల్పాడు. నార్వే చెస్ టోర్నమెంట్‌ లో భార‌త గ్రాండ్‌ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. చెస్‌ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ మాగ్నస్ కార్ల్‌ స‌న్‌ కు షాకిచ్చాడు. సొంత గ‌డ్డపైనే అత‌డిని ఓడించి రికార్డ్ నెల‌కొల్పాడు.

అవును... 18 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్ ప్రజ్ఞానంద మే 29, బుధవారం స్టావాంజర్‌ లో జరిగిన నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌ లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌ సెన్‌ పై తన తొలి క్లాసికల్ విక్టరీని నమోదు చేసుకున్నాడు. ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌ మాస్టర్ ఆధిక్యం సాధించాడు. ఈ మ్యాచ్‌ లో ప్రజ్ఞానంద తెల్ల పావుల‌తో బ‌రిలో దిగాడు.

ఆరంభంలో ప్రజ్ఞానంద‌పై కార్ల్‌ స‌న్ ఆధిప‌త్యం క‌న‌బ‌రిచాడు. అయినప్పటికీ ఒత్తిడిని జ‌యిస్తూ అద్భుతంగా ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌ స‌న్ చేసిన త‌ప్పుల‌ను సోపానాలుగా మలుచుకుంటూ మ్యాచ్‌ లో విజ‌యం సాధించాడు. 37 ఎత్తుల్లోనే కార్ల్‌ స‌న్‌ ను ప్రజ్ఞానంద ఓడించాడు.

నార్వే చెస్ టోర్నమెంట్‌ లో మూడో రౌండ్ ముగిసే సమయానికి ప్రజ్ఞానంద 9 పాయింట్లలో 5.5 కి చేరుకుని టాప్ ప్లేస్ లో నిలిచాడు. అదే సమయంలో అమెరికన్ గ్రాండ్‌ మాస్టర్ ఫాబియో కరువానా బుధవారం ఘం డింగ్ లిరెన్‌ పై విజయం సాధించి మూడు పూర్తి పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.

కాగా గ‌త ఏడాది చెస్‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్‌ లో మాగ్నస్ కార్ల్‌ స‌న్ చేతిలోనే ప్రజ్ఞానంద ఓట‌మి పాల‌యిన సంగతి తెలిసిందే. అయితే... వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మికి తాజాగా నార్వే చెస్ టోర్నమెంట్‌ లో ప్రతీకారం తీర్చుకున్నాడు ప్రజ్ఞానంద. ఈ మ్యాచ్‌ తో క్లాసిక‌ల్ చెస్‌ లో మాగ్నస్ కార్ల్‌ స‌న్‌ ను ఓడించిన నాలుగో భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద రికార్డ్ సృష్టించాడు.

ఆ సంగతి అలా ఉంటే... క్లాసిక్ ఫార్మెట్ లో ప్రజ్ఞానంద విజయం సాధించడంపై "నార్వే చెస్" ఒక స్పెషల్ వీడియోను "ఎక్స్" లో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా... మాగ్నస్ మొదట్లో కొన్ని తప్పులు చేశాడని, దీంతో గేమ్ ప్రజ్ఞానంద చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. ప్రజ్ఞానంద కెరీర్ లో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని చెబుతూ.. శుభాకాంక్షలు తెలిపింది.

ఇక ఈ గేమ్ ని ఎంతో కూల్ గా ఆడుతూ.. వరల్డ్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ ని ఓడించినప్పటికీ ఈ 18ఏళ్ల భారత్ ప్లేయర్ ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. దీంతో... నెటిజన్స్ అంతా ప్రజ్ఞానంద్ ను మిస్టర్ కూల్ అంటూ ప్రశంసిస్తున్నారు.