Begin typing your search above and press return to search.

కేఏ పాల్ విశాఖ ఎంపీ కావాల్సిందేనట...!

మత ప్రభోదకుడు రాజకీయ పార్టీ నేత అవతారం ఎత్తడం విడ్డూరమే. అది కేఏ పాల్ విషయంలో జరిగింది

By:  Tupaki Desk   |   10 Nov 2023 2:01 AM GMT
కేఏ పాల్ విశాఖ ఎంపీ కావాల్సిందేనట...!
X

మత ప్రభోదకుడు రాజకీయ పార్టీ నేత అవతారం ఎత్తడం విడ్డూరమే. అది కేఏ పాల్ విషయంలో జరిగింది. ఇక చూస్తే కేఏ పాల్ మాటలు ఎపుడూ ఒక స్థాయిలో ఉంటాయి. తాను పోటీ చేస్తే ప్రత్యర్ధుల డిపాజిట్లు గల్లంతు అనే అంటారు ఆయన. ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ కేఏ పాల్ ఉంటారు అన్నట్లుగా ఉంది అయిదేళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం.

ఇందులో ఉప ఎన్నికలూ మినహాయింపు లేదు. మునుగోడు ఉప ఎన్నిక జరిగితే అక్కడకు వెళ్లారు కేఏ పాల్. ఇపుడు తెలంగాణా ఎన్నికలు జరిగితే పోటీకి తయారు అంటున్నారు. తాను అభ్యర్ధుల మొదటి జాబితా ప్రకటించాను అని చెబుతున్నారు. రెండవ జాబితా ప్రకటించాలనుకున్నా ప్రచారం చేయలేమని ఆలోచించి ఆపేశాను అంటున్నారు.

అదే సమయంలో తన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుని కేటాయించకపోవడం పట్ల కేఏ పాల్ మండిపడుతున్నారు. దేశంలో ఉన్న 2,900 రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘానికి తన పార్టీ ఒక్కటే కనిపించడంలేదా అని అంటున్నారు తన పార్టీ అభ్యర్ధులు తెలంగాణా ఎన్నికల్లో బీ ఫారాలు దాఖలు చేస్తారని, దానికి ఒకటి రోజులు గడువు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.

ఇక తానే దేశాన్ని కాపాడే సేవియర్ అని అంటున్నారు. ప్రజా శాంతి పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ బీయారెస్ పార్టీలు అడ్డుకుంటున్నారు అని కూడా ఆయన అంటున్నారు. ఇక తాను విశాఖ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు.

తనను ప్రజలు ఎన్నుకుంటేనే దేశానికి భవిష్యత్తు అని అంటున్నారు. తనను గెలిపించకపోతే దేశమే నష్టపోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. దేశానికి తాను ఆశాకిరణం ఇది అంతా గుర్తుంచుకోవాలని కేఏ పాల్ అనడం విశేషం. ఇక కేయే పాల్ తనను తాను అంబేద్కర్ గాంధీజీతో పోల్చుకోవడం విశేషం. వారు గతించాక కానీ వారి గురించి గొప్పతనం జనాలు అర్ధం చేసుకోలేదని అలాగే తానూ గొప్పవాడిని అని అంటున్నారు.

ఇక కేఏ పాల్ మాటలలో కొసమెరుపు ఏంటి అంటే తెలంగాణ అభివృద్ధిపై తనతో చర్చలు జరపాలని కేటీఆర్‌, కవితలకు సవాల్‌ విసరడం. మొత్తానికి చూస్తే కేఏ పాల్ మార్క్ పాలిటిక్స్ పీక్స్ కి వెళ్తోంది అని అంటున్నారు.

కేఏ పాల్ తాను సీరియస్ పొలిటీషియన్ ని అని ఎంత చెప్పినా జనాలు మాత్రం ఆయన మాటలను విని ఎంజాయ్ చేస్తున్నారు.

మరి కేఏ పాల్ తానే సేవియర్ అని అంటే అది కూడా జనాలకు సరదాగానే అనిపిస్తోంది. కేఏ పాల్ ఎన్నికల మోజు ఆయనకు చట్ట సభలలలోకి వెళ్లాలన్న తాపత్రయం తపన అన్నీ కూడా జనాలకు వినోదంగా అనిపిస్తున్నాయి. పాల్ మాత్రం తాను వెరీ సీరియస్ అంటున్నారు. అక్కడే వస్తోంది గ్యాప్ మరి.