'పవన్ కు ఎవరైనా చెప్పండి'... ప్రకాశ్ రాజ్ కౌంటర్ స్టార్ట్!
దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు తమిళనాట బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 11:24 AM ISTదక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు తమిళనాట బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... కేంద్ర ప్రభుత్వానికి - తమిళనాడుకు మధ్య వివాదం తీవ్రస్థాయిలో నడుస్తోందని అంటున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా... ఈ వ్యాఖ్యలకు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నుంచి ఆసక్తికర సమాధానం వచ్చేసింది!
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్ట్ గా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో.. తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించి.. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చారు. దీన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి.
స్టాలిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకొన్న చర్యగా తమిళ సంఘాలు అభివర్ణించాయి. ఈ సమయంలో తాజాగా పిఠాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన పవన్... తమిళనాడు హిందీని వ్యతిరేకించడంపై తనదైన లాజిక్ లాగారు.. ఈ విషయాన్ని సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయడానికి ముడిపెట్టి తమిళనాడు సర్కార్ ని తగులుకున్నారు.
ఇందులో భాగంగా... దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ తమిళులు మాట్లాడుతున్నారని.. అలాంటప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్బింగ్ చేయొద్దని.. మీకు డబ్బులేమో యూపీ, బీహార్ నుంచి కావాలా? హిందీ మాత్రం వద్దా? అని ప్రశ్నించారు.. రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏమిటి? వివేకం, ఆలోచన ఉండోద్దా? అంటూ నిలదీశారు పవన్ కల్యాణ్.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇందులో భాగంగా... "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం" అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్" అని ట్వీట్ చేశారు.
కాగా... గతంలో కూడా ప్రకాశ్ రాజ్ పలు విషయాల్లో పవన్ కు కౌంటర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ స్పందించేవారు. ఈ క్రమంలో తాజగా తమిళులపై హిందీ భాష రుద్దుడు అంశంపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు!