Begin typing your search above and press return to search.

కునాల్ కామ్రా వీడియోతో బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్న ప్రకాష్ రాజ్

అధికారంలో ఉన్న పార్టీలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని శివసేన (యూబీటీ వర్గం) నాయకుడు ఒకరు తెలిపారు

By:  Tupaki Desk   |   26 March 2025 9:33 AM
Prakash Raj Criticizes BJP
X

హాస్య కళాకారుడు కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారం రేపాయి. అక్కడి ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురించి ఆయన ఉపయోగించారంటున్న 'గద్దార్' అనే పదంపై ఆగ్రహించిన శివసైనికులు ముంబైలోని హ్యాబిటాట్ స్టూడియోలో విధ్వంసం సృష్టించారు. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని ప్రతిపక్షాలు అభిప్రాయపడ్డాయి. అధికారంలో ఉన్న పార్టీలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని శివసేన (యూబీటీ వర్గం) నాయకుడు ఒకరు తెలిపారు. ఇక బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కునాల్‌కు మద్దతు తెలిపారు.

బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ , మితవాద సంస్థలను విమర్శించడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదలని ప్రకాష్ రాజ్, కునాల్ కామ్రా స్టాండప్ కామెడీ వీడియోను షేర్ చేసి, మితవాదులను జోకర్స్ అని అన్నారు. "కునాల్ కామ్రా యొక్క కమాల్‌ను మిస్ చేసుకోకండి.. షేర్ , రీట్వీట్ చేయండి. ఈ స్వరాన్ని సమర్థించండి. తద్వారా జోకర్స్‌కు ఇది వారిపై వేసిన జోక్ అని తెలుస్తుంది" అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

అమోక్ అనే ఎక్స్ ఖాతా నుండి వచ్చిన ట్వీట్‌ను ఫార్వర్డ్ చేస్తూ, ప్రకాష్ రాజ్ ఈ విధంగా రాసుకొచ్చారు. '45 నిమిషాల ఈ కునాల్ కామ్రా వీడియో మితవాదుల పునాదులను కదిలించింది. హాస్యం , వ్యంగ్యంతో సత్యాలను మాట్లాడారు, దానిని బీజేపీ జీర్ణించుకోలేదు' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, "ప్రధాన్ సేవక్ , గ్రోక్ ఎవరు ముందుగా సమాధానం ఇస్తారు? రిక్షావాలా, చాయ్ వాలా వీరి సేవ సరిగా లేనప్పుడు, నవ్వితే తప్పేంటి" అని మరో వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వల్ల ఈ కునాల్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారని.. అతడి పాట కూడా ఇప్పుడు పాపులర్ అయ్యిందని.. ఏక్ నాథ్ షిండ్ కు బిగ్ థ్యాంక్స్ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ‘క్రికెట్ లో దీన్నే హిట్ వికెట్ అంటారు’ అని సెటైర్ వేశారు.

‘‘మనమందరం ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే, బీజేపీకి కేవలం 239 సీట్లు మాత్రమే వచ్చాయి. అంబానీ తన కుమారుడికి అడవిని కొనిచ్చారు. బాలీవుడ్ నటీనటులను పెళ్లికి పిలిచి, వారిని కూర్చోబెట్టి, అంబానీ కుటుంబ సభ్యులు నృత్యం చేశారు’’ అని కునాల్ కామ్రా ఆ స్టాండప్ కామెడీ షోలో పాడుతూ ఎద్దేవా చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇదే బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి గురైంది..

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం యొక్క అవినీతి గురించి మాట్లాడిన యూట్యూబర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దాని గురించి కూడా రాయండి అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్‌కు కామెంట్ వచ్చింది. ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం గురించి మాట్లాడరు, ఆయన ఒక కపటి అని మరొకరు ఆయన పోస్ట్‌కు కామెంట్ చేశారు.

-వివాదానికి కారణం ఆ పేరడీ పాట

2022లో ఏక్‌నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేపై చేసిన తిరుగుబాటును వివరించడానికి కునాల్ కామ్రా 'దిల్ తో పాగల్ హై' సినిమాలోని పాటను మార్చి పాడారు. దీంతో ఆగ్రహించిన షిండే అభిమానులు హ్యాబిటాట్ స్టూడియోపై దాడి చేశారు. ఈ స్టూడియోలోని అక్రమ భాగాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది.