Begin typing your search above and press return to search.

మౌనంగా ఉంటే ఈ దేశ గాయాలు మాన‌తాయా?: మోడీపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్‌

ఇదే విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించిన ప్ర‌కాశ్ రాజ్.. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయని అన్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:56 PM GMT
మౌనంగా ఉంటే ఈ దేశ గాయాలు మాన‌తాయా?:  మోడీపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్‌
X

బ‌హు భాషా న‌టుడు, విమ‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ రాజ్ తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ప‌రోక్ష వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. మౌనంగా ఉంటే గాయాలు మాన‌తాయా? అంటూ.. ఇటీవ‌ల ఘ‌ట‌న‌ల‌కు సంబందించి ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ, బ‌య‌ట కూడా.. మ‌ణిపూర్ అంశంపై కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు ఆందోళ‌న చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్యం గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ విష‌యంలో స్పందించాల‌ని ప‌దే ప‌దే డిమాండ్ చేశాయి. ఎట్ట‌కేల‌కు అవిశ్వాస తీర్మానం కూడా ప్ర‌వేశ పెట్టాయి.

అయితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌ణిపూర్ అంశం మిన‌హా.. ఇత‌ర అన్ని విష‌యాల‌పైనా స్పందించారు. ఇదే విష‌యాన్ని తాజాగా ప్ర‌స్తావించిన ప్ర‌కాశ్ రాజ్.. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయని అన్నారు.

కానీ.. అదే మౌనం దేశానికి తగిలిన గాయాలను మాన్ప‌లేద‌ని చెప్పారు. పైగా.. ఆ గాయాలు కేన్స‌ర్‌కు(రాచపుండు) దారితీస్తాయ‌ని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య కళానిలయంలో ‘సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం’ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. ''పార్ల‌మెంటులో మౌనం.. బ‌య‌టా మౌనం.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన అంశాల‌పైనే 'కొంద‌రు' మాట్లాడ‌తారు. ఇది దేశానికి చేటు చేస్తుంది. గాయాల‌ను మాన్ప‌దు స‌రిక‌దా.. కేన్స‌ర్‌కు దారి తీస్తుంది'' అని ప‌రోక్షంగా ప్ర‌ధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరని చెప్పారు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారన్నారు.

"ప్రస్తుత సమాజం సందిగ్ధతలో ఉంది. వంద రోజులుగా మణిపుర్ మండిపోతుంది. మణిపుర్ గురించి ప్రశ్నిస్తే హరియాణా, బెంగాల్.. అని ఆ విష‌యాలు మాట్లాడ‌తారు. కానీ, మ‌ణిపూర్ విష‌యానికి అవి అనవసర విషయాలు. ఇప్పుడు దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతు న్నాయి. దీనిని క‌ట్ట‌డి చేయ‌క‌పోగా.. పెంచి పోషిస్తున్నారు" అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.