సనాతన ధర్మంపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
కర్ణాటకలోని కలబురిగిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 11 Sep 2023 8:00 AM GMTసనాతన ధర్మంపై ఇటీవల డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలానికి దారితీశాయి. ఈ కోవలో ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలోని కలబురిగిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మంపై ప్రజల్లో చర్చ తీవ్రరూపం దాల్చిన తరుణంలో.. సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని దూకుడుగా మాట్లాడే వారు హిందువులు అనిపించుకోరన్నారు. "సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని నిలబెట్టాలని దూకుడుగా మాట్లాడేవారు హిందువులు కాదు. తమను తాము హిందుత్వ కాంట్రాక్టర్లుగా వారు ప్రచారం చేసుకుంటున్నారు. తమ రాజకీయ దురుద్దేశాలను పెంచుకునేందుకే వారు మాట్లాడుతున్నారని వారికి చెప్పాలి. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. వారు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను" అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
'రైట్ వింగ్ సిద్ధాంతకర్తలు శాస్త్రీయ ఆలోచనను వ్యాప్తి చేయడానికి అనుమతించరు. పేదరికాన్ని, నిరక్షరాస్యతను ఉంచడానికే చూస్తారు. వారు ఎప్పుడూ సమాన విద్యను డిమాండ్ చేయరు. ఎందుకంటే, ప్రజలు చదువుకుని పేదరికం నుండి బయటపడితే వారు ప్రశ్నించడం ప్రారంభిస్తారని వారికి తెలుసు" ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వన్ ఇండియా వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ భారతదేశానికి ప్రస్తుతం సమాన విద్య, సమాన అవకాశాలు అవసరమని తెలిపారు. మనకు కావలసింది ఒకే భారతదేశం, సమాన విద్య, సమాన అవకాశాలని వ్యాఖ్యానించారు.
ఒక కళాకారుడిగా తాను మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. 'నన్ను పెంచినందుకు ఇది సమాజానికి నేను చెల్లించే ప్రతిఫలం. కళాకారుడు మాట్లాడాలి. నేను ప్రజల పక్షపాతిని. నేను ప్రజలతో ఉన్నాను. నేను నిజం మాట్లాడితే, నన్ను దేశ వ్యతిరేకిగా ముద్ర వేస్తారు. వారు నన్ను దేశ వ్యతిరేకిగా చూపించకపోతే, వారు నిలబడరు' అని ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో మతపరమైన విభేదాలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్, మానవతావాదం మాత్రమే మిగిలి ఉంటుందని, మిగతావన్నీ నశించిపోతాయని అన్నారు.
'మనం ప్రయాణిస్తున్న ఓడ భారతదేశం మునిగిపోతోంది. కెప్టెన్‌కి ఎప్పుడు దూకాలి, ఎలా ఈత కొట్టాలో తెలుసు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఓడను రక్షించాలి' అని వ్యాఖ్యానించారు.
దేశంలో అంటరానితనం ఇప్పటికీ ఉందన్నారు. 8 ఏళ్ల చిన్నారిని కూడా మతంతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో ఒక బస్సులో కండక్టర్ తన మతానికి చిహ్నమైన టోపీని ధరించి ఉన్నందుకు ఒక మహిళ అతడిని తలపైన టోపీ తీసేయాలని కోరిందని ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కండక్టర్ అయ్యప్ప మాల ధరిస్తే అతడిని కండక్టర్ గా చూస్తారా? లేక భక్తుడిగా చూస్తారా అని నిలదీశారు.
ఇటీవల జరిగిన జై శ్రీరామ్ ఊరేగింపులో 18 ఏళ్ల యువకులు కత్తులతో పాల్గొన్నారని ప్రకాశ్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. చక్కటి భవిష్యత్తు ఉన్న యువకులకు ఇలా కత్తులు పట్టుకునేలా ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.