మోడీని వెంటాడుతున్న ప్రకాష్ రాజ్... మరో వైరల్ ట్వీట్!
అవును... మోడీపై తనదైన శైలిలో విమర్శలు, వెటకారాలూ గుప్పించే నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 1 Jun 2024 4:19 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీపైనా తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్! బీజేపీ, మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన నిత్యం ఎండగడుతూ.. పలు వేదికలపై తనదైన శైలిలో విచురుకుపడుతుంటారు. ఈ సమయంలో మరోసారి ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.
అవును... మోడీపై తనదైన శైలిలో విమర్శలు, వెటకారాలూ గుప్పించే నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం కన్యాకుమారిలో సుదీర్ఘ ధ్యానంలో ఉన్న మోడీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ... "మెడిటేషనా.. లేక, మీడియా అటెన్షనా..?" అంటూ తనదైన శైలిలో సందేహాన్ని వ్యక్తపరిచారు.
అంతకంటే ముందు మోడీ కన్యాకుమారి పర్యటనకు వెళ్తున్న సమయంలో... ప్రమాదానికి గురై తుక్కు తుక్కైనా కారును లాక్కుని వెళ్తున్న కారు వీడియోను పోస్ట్ చేస్తూ... "స్వయం ప్రకటిత దేవుడు కన్యాకుమారికి వెళ్తున్నాడు" అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మోడీని ఓడిపోయిన చక్రవర్తిగా అభివర్ణిస్తూ.. మోడీ ధ్యానంలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మరో ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా... "నేడు ఎన్నికల చివరిదశ.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాను.. నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నేను నమ్ముతున్నాను.. 4వ తేదీన కలుద్దాం.. వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి" అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు మోడీ ధ్యానం చేస్తున్న రెండు ఫోటోలు షేర్ చేశారు.
కాగా.. ఇటీవల ప్రధాని మోడీకి సంబంధించిన ఓ హోటల్ బిల్లు ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఉన్నప్పటికీ దాన్ని చెల్లించకపోవడంతో సదరు హోటల్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా స్పందించిన ప్రకాష్ రాజ్... "దేవుడు పంపిన నాన్ బయోలాజికల్ జీవి నుంచి బిల్లును మానవులు ఎలా క్లెయిమ్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు.