Begin typing your search above and press return to search.

తోపుదుర్తికి కొత్త తలనొప్పి.. ఆ మహిళ చెప్పినోడ్ని పట్టుకోవాలి

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి కొత్త టెన్షన్ వచ్చి పడింది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:08 AM GMT
తోపుదుర్తికి కొత్త తలనొప్పి.. ఆ మహిళ చెప్పినోడ్ని పట్టుకోవాలి
X

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి కొత్త టెన్షన్ వచ్చి పడింది. సాయం కోసం తన వద్దకు వచ్చిన ఒక బాధితురాలిని వేధింపులకు గురి చేస్తున్న వైనం నియోజకవర్గంలో చర్చకు దారి తీసింది. తనకు సాయం చేస్తానని చెప్పిన అధికార పార్టీకి చెందిన నేత ఒకరు.. అందుకు బదులుగా తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్న దగుల్బాజీని గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. తనకు సంబంధం లేకున్నా.. తన చుట్టూ ఉండే నేతల్లో ఒకరు ఈ పాడు పనికి పాల్పడటంతో.. దాని లెక్క తేల్చాల్సిన బాధ్యత తోపుదుర్తి మీద పడిందంటున్నారు.

కీలకమైన ఎన్నికల వేళలో వెలుగు చూసిన ఈ ఉదంతంపై ఇప్పుడు ఆయన సీరియస్ గా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందంటున్నారు. తాజాగా రాప్తాడులో టీడీపీ నేత పరిటాల సునీత నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన బాధిత మహిళ.. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కరోనా వేళలో భర్తను కోల్పోయి.. కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో ఆర్థిక సాయం అందించాలని అధికార పార్టీ నేతల్ని ఆశ్రయిస్తే తనకు చేదు అనుభవం ఎదురైందని పేర్కొన్నారు.

అధికార పార్టీకి చెందిన సానుభూతిపరురాలి విషయంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం.. రాజకీయ ప్రత్యర్థి నేతను కలిసి సాయం అందించాలని కోరటం ఎమ్మెల్యే తోపుదుర్తికి కొత్త పంచాయితీగా మారిందంటున్నారు. రెండేళ్ల క్రితం తన భర్త కరోనాతో చనిపోవటంతో సాయం కోసం స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా.. అన్ని విధాలుగా సాయంగా ఉంటానని చెప్పారని సదరు మహిళ చెబుతోంది.

సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుగా ఉండేందుకు అవసరమైన పత్రాల్ని అందించానని.. అయినా ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. తనకు సాయం చేయాలని కోరిన స్థానిక వైసీపీ నేత.. తన కోరిక తీర్చాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా సదరు బాధిత మహిళ పేర్కొంది. తనకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయిస్తే.. వారు పట్టించుకోలేదన్నారు. తనను.. తన పిల్లల్ని రక్షించాలని కోరిన సదరు మహిళకు అండగా ఉంటానని పరిటాల సునీత అభయమిచ్చారు. సొంత పార్టీకి చెందిన బాధితురాలిని ఎలా వేధిస్తారంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు పరిటాల సునీత. ఈ విషయం అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సదరు బాధిత మహిళపై అనుచితంగా వ్యవహరించే వారిని గుర్తించేందుకు తోపుదుర్తి సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల వేళ.. వెలుగు చూసిన ఈ ఉదంతం అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.